- శాప్ అధ్వర్యంలో మంత్రి మండిపల్లి అధ్యక్షతన సమావేశం
- క్రీడా విధానం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- గత ఐదేళ్లలో ఇంత ప్రశాంతంగా చర్చ జరగలేదన్న క్రీడా సంఘాలు
- శాప్, క్రీడా సంఘాలు సంయుక్తంగా క్రీడా రంగం అభివృద్ధికి కృషి చేయాలన్న మంత్రి
- బోగస్ సర్టిఫికెట్లను అరికట్టే బాధ్యత క్రీడా సంఘాలదేనని స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్ల పాలనలో భ్రష్టు పట్టిన రాష్ట్ర క్రీడారంగానికి తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలతో క్రీడా సంఘాలతో చాలాకాలం తర్వాత రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) సమావేశం ఏర్పాటు చేసింది. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం మంత్రి మండిపల్లి అధ్యక్షతన శాప్ ఆధ్వర్యంలో క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఎండీ గిరీష్, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ తప్పిదాలు పునరావృతం కారాదు
సమావేశంలో క్రీడా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ క్రీడాకారులకు సంబంధిత సంఘాలు ఎంతగానో సహకరిస్తున్నాయన్నారు. పేద బిడ్డలను మంచి క్రీడాకారులగా తీర్చిదిద్దాలని, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో క్రీడలకు శాప్ ద్వారా ఆర్థిక సాయం, తోడ్పాటు ఉండాలని కోరారు. క్రీడాకారులకు మౌలిక సదుపాయాల కల్పనకు క్రీడా సంఘాలు కట్టుబడి ఉన్నాయన్నారు. 2019 -24 మధ్య కాలంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కానివ్వకూడదని, క్రీడా సంఘాల అభిప్రాయాలు తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాలని కోరారు. ఒలంపిక్స్‌లో మన క్రీడాకారులు మరింత ఎక్కువ మంది పాల్గొనేలా క్రీడా సంఘాలు తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుందని, అలాగే క్రీడలనే భవిష్యత్తుగా చేసుకున్న క్రీడాకారులను ప్రోత్సహించే బాధ్యత అందరి మీద ఉందన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకు సాగాలని, వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడా జట్టులకు టీఏ, డీఏలు అమలు చేయాలని, క్రీడాకారులకు జీవితాలు నిలబెట్టేలా శాప్ కార్యాచరణ రూపొందించాలని కోరారు. జీవో నెంబర్ 62ను విద్యాశాఖ అమలు చేయాలన్నారు. క్రీడా సంఘాలు లేనిదే క్రీడలు లేవన్నారు. కొందరు క్రీడాకారులు బోగస్ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగంలో చేరడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడలకు సంబంధించిన అన్ని జీవోలను మిళితం చేసి ఒకే జీవో ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 350 పోస్టులను భర్తీ చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడా సంఘాలను విస్మరించారని, శాప్‌లో ఎవరూ వారి సమస్యలు వినేవారు కాదని వాపోయారు. క్రీడాకారుల బాగోగుల కోసమే క్రీడా సంఘాలు ఉన్నాయని వారు తెలిపారు. సంఘాలకు శాప్ ద్వారా ఆర్థిక సహకారం అందించాలని కోరారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో జరిగిన సమావేశం ఇదేనని కితాబు ఇచ్చారు. మల్టీపర్పస్ స్టేడియాలు ఏర్పాటు చేయాలని, ఈ ప్రభుత్వం హయాంలో సీఎం చంద్రబాబు విజన్‌కి అనుగుణంగా క్రీడలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
ఆరు నెలలకోసారి సమావేశం
అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని హామీ ఇచ్చారు. క్రీడా సంఘాలు అందించే సహకారం పట్ల సంఘ ప్రతినిధులను అభినందించారు. బోగస్ సర్టిఫికెట్లను అరికట్టే బాధ్యత పూర్తిగా క్రీడా సంఘాల పైనే ఉందన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ, క్రీడా సంఘాలు ఒకే కుటుంబ సభ్యులన్నారు. క్రీడా రంగాన్ని ప్రగతి పథంలో నడపడానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖకు అనుబంధంగా క్రీడలను అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో క్రీడారంగానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలిపారు. శాప్ పరిధిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉంటామని, 175 నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు క్రీడారంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్రీడా రంగానికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. క్రీడా సంఘాలకు ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కార్యచరణ రూపొందిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమం అనంతరం మంత్రి మండిపల్లిని పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.