- విధి, విధానాలు రూపొందించాలి
- అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై మంత్రి ఆందోళన
- ఉన్నతవిద్య శాఖపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలుచేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నతవిద్యశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేష్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యా సంస్థల్లో నిలచిపోయాయన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో డ్రగ్స్ ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. అదేవిధంగా డ్రగ్స్ పై విద్యార్థులను చైతన్యం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీచేసేందుకు కసరత్తు చేపట్టాలన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్, ఎగ్జామినేషన్ షెడ్యూలు, క్యాలండర్ తయారుచేసి, నిర్ణీత సమయంలో పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గత ఐదేళ్లుగా ప్రవేశాలు తగ్గిపోవడంపై మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిసారించి, అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలు తదితర అంశాలన్నింటినీ డ్యాష్ బోర్డులో పొందుపర్చాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏ మేరకు ఉండాలి, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటీస్ షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు కళాశాలల ఎంపిక, రాష్ట్రంలో శ్రీ పొట్టిశ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల ఏర్పాటు చేసే అంశాలపై సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో ఉన్నత విద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యశాఖ ఇన్‌ఛార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ బి.నవ్య, తదితరులు పాల్గొన్నారు.