విశాఖపట్నం (చైతన్యరథం): గత పాలకులు నెయ్యే లేకుండా రసాయనాల మిశ్రమాన్ని తిరుమలకు సరఫరా చేశారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. జనసేన ఎమ్మెల్యేలతో గురువారం పర్చువల్గా జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పారు. భక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వైసీపీ అరాచకాలను ప్రజలకు చెబుదామన్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభలో చర్చిద్దామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా క్షేమమే ధ్యేయంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని సూచించారు.
రైల్వేకోడూరు ఎమ్మెల్యే వ్యవహారంపై..
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై సమావేశంలో చర్చ జరిగింది.. త్రిసభ్య కమిటీ విచారణకు వచ్చి అరవ శ్రీధర్ వివరణ ఇవ్వాలని నిర్ణయించారు. కమిటీ నివేదిక ప్రకారం పవన్ కల్యాణ్ చర్యలు తీసుకుంటారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే జనసేన లక్ష్యంగా వైసీపీ తప్పుడు ప్రచారం చేయిస్తోందని పవన్ దృష్టికి సభ్యులు తీసుకెళ్లారు.
రెండు జిరాఫీల దత్తత
విశాఖ నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సందర్శించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా జూపార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్లు తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జూ పార్కులో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎనక్లోజర్ను పవన్ ప్రారంభించారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్కులో నగరవనాన్ని ప్రారంభించారు.













