అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. గతంలో చేపట్టిన ‘మోత మోగిద్దాం’, ‘కాంతితో క్రాంతి, ‘న్యాయానికి సంకెళ్లు’’ తరహాలోనే తాజాగా మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది. ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పిలుపుమేరకు వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ‘‘సైకో జగన్ పోవాలి’’ అని రాసిన పత్రాలను ప్రజలు, పార్టీ శ్రేణులు దహనం చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. జగన్ అనే చెడుపై చంద్రబాబు అనే మంచి సాధించబోయే విజయంగా ఈ దసరా పండుగ చేసుకోవాలని టీడీపీ కోరింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ రాజమహేంద్రవరం క్యాంప్ సైట్ వద్ద జగనాసుర దహనం కార్యక్రమం.
అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినాదాలు చేస్తూ సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ ఇంఛార్జులు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, పరుచూరి అశోక్‌బాబు, బుచ్చి రాంస్రాద్, ఏ ఎస్ రామకృష్ణ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.