- తెలుగుజాతిని ఎవరెస్ట్ ఎత్తులో నిలిపిన మహానేత
- ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వ పాలన
- ప్రాణం కంటే పార్టీనే మిన్న అనే కార్యకర్తలు టీడీపీకే సొంతం
- కార్యకర్తల వల్లే సీఎం సీటులో కూర్చున్నా
- నేటి అధికారం వెనుక వారి త్యాగాలు ఎనలేనివి
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం) తెలుగుజాతిని ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున నిలిపిన నందమూరి తారక రామారావును ఎన్నటికీ మరువలేమని… ఆయన చూపిన మార్గాన్ని విడవబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ శిబిరంలో రక్తదానం చేసిన వారికి సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్టీఆర్ దూరమై 30 ఏళ్లు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిన ఏకైక నాయకుడన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగపురుషుడు. మన ఆరాధ్య దైవం ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి… ఒక చరిత్ర సృష్టించారు. దేశంలో సుపరిపాలనకు ఎన్టీఆర్ అర్థం చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. విద్యావంతులు, బడగులు, మేధావులకు టికెట్లు ఇచ్చి సమర్థులను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సామాజిక న్యాయం చేశారు… తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన చేపట్టారు. పొట్టి శ్రీరాములు భాషా ప్రాయుక్త రాష్ట్రం కోసం పోరాడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధిస్తే.. మదరాసీలు అని తెలుగు వాళ్లను పిలుస్తున్న రోజుల్లో తెలుగు జాతికి ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారు. పాలనలో ఎన్టీఆర్ సంస్కరణలు తీసుకొచ్చారు. బడుగుల కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. తర్వాత అది దేశంలో చట్టం అయింది. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని నేను 33 శాతం చేశాను. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్, శాసనసభల్లో 33 శాతం సీట్లు మహిళలకురాబోతున్నాయి. ఇది మార్పుకు నాంది అని ముఖ్యమంత్రి చెప్పారు.
రామన్న బాటలో…
పేదల కోసం ఎన్టీఆర్ రూ.2కే కేజీ బియ్యం ఇచ్చారు… ఆహార భద్రతకు నాంది పలికారు. తిరు మలలలో అన్నదానం ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రతి రోజూ లక్ష మందికి తిరుమలలో నిత్యం అన్నదానం జరుగుతోంది. నేడు మనం అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5 లకే అన్నం పెడుతున్నాం. అన్ని నియోజక వర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. వృద్ధులకు రూ.35లతో ఎన్టీఆర్ పింఛను ప్రారంభించారు. దాన్ని నేను రూ.70చేశాను. ఆ తర్వాత కాలంలో రూ.200 నుంచి ఒకేసారి రూ.2000లకు, ఇప్పుడు రూ.4 వేలకు పెంచాం. పేదలకు ఎన్టీఆర్ పక్కా ఇళ్లను ఇచ్చారు. అదే బాటలో ఇప్పుడు మన ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పేదలతో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తున్నాం. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తోంది. ఇటీవల 3లక్షల గృహప్రవేశాలు చేశాం. వచ్చే ఉగాది రోజున 5 లక్షల గృహ ప్రవేశాలు ఉంటాయి. మరో 3 ఏళ్లలో అందరికీ ఇల్లు నిర్మించి ఇస్తాం. సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం సక్సెస్చేశాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పని చేస్తున్నాం. 2024లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం. పెన్షన్లు పెంచాం. మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చాం. పోలీస్ ఉద్యోగాలు ఇచ్చాం. మరిన్ని ఉద్యోగాలు చేపడతాం. చదువుకున్న ఏ ఒక్కవ్యక్తి ఖాళీగా ఉండకుండా ఉపాధి కల్పించేందుకు ముందుకెళ్తున్నాం. రికార్డులు తారు మారు చేయకుండా ఉండేందుకు ఎన్టీఆర్ ఒకప్పుడు మున్సబ్, కరణం వ్యవస్థను రద్దుచేశారు. గత పాలకులు కొత్త గ్రామాధికారులను తీసుకొచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయాలని చూశారు. వారసత్వంగా వచ్చిన భూము ల పత్రాలపై వారిఫోటోలు వేసుకున్నారు. అడ్డదిడ్డంగా వ్యవహరించి భూములను 22ఏలో పెట్టారు. చెప్పిన మాట ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. పట్టాదారు పుస్తకాల్లో గత పాలకులు ఫోటోలు తొలగించి రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు అందిస్తు న్నాం. రీ-సర్వేను పక్కాగా చేస్తున్నాం. బ్లాక్ చైన్ విధానం తెస్తున్నాం. క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చాం. రికార్డులను ట్యాంపర్ చేస్తే జైలుకు వెళ్తారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతి ఎకరాకు నీరు… విద్యుత్ ఛార్జీల తగ్గింపు
గత ప్రభుత్వంలో టీచర్లును మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారు. వారికి రావాల్సిన బకాయిలు అడిగితే తప్పుడు కేసులు పెట్టారు. నేడు ఉద్యోగులను గౌరవించి బకాయిలు, డీఏలు చెల్లిస్తున్నాం. కొన్ని బకాయిలు చెల్లించి వారు ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకునేలా చేశాం. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి. కాకినాడలో దేశంలో ఎక్కడాలేని విధంగా ఏఎమ్న్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. ఇదీ తెలుగువారి సత్తా. ఎన్టీఆర్ వచ్చాక కృష్ణా జలాలు వాడుకునే హక్కు ఉందని చూపించారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీళ్లివ్వడంతోపాటు… సీమకు కూడా నీళ్లు వచ్చేలా చేశారు. కాల్వల ద్వారా వచ్చే నీళ్లతో పంట లకు నీళ్లిచ్చారు. ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ-నీవా, తెలంగాణలో ఎస్ఎల్సీబీతో పాటు తెలంగాణలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సమైక్య రాష్ట్రం, నవ్యాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ ప్రాణం పోసింది. ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేలా చూస్తున్నాం… నీటి భద్రత కల్పించాలని సంకల్పించాం. రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఒక్క సీజన్లో హంద్రీ-నీవా కాల్వను వెడల్పుచేసి సీమ చివరి ప్రాంతాలకు నీళ్లి చ్చాం. ఈ ఏడాదిలోనే వెలుగొండ, ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. 2027 జూన్ నెలలో పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరిస్తాం. శ్రీకాకుళంలోని వంశధార నుంచి నెల్లూరులోని పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఎవరికీ నష్టం లేకుండా రాష్ట్రాన్ని బాగు చేస్తాం. గత ప్రభుత్వంలో రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. రూ.1.20లక్షల కోట్లు అప్పులు పెట్టారు. నేడు రూ.4,600 కోట్ల ట్రూప్ అఫ్ ఛార్జీలు వేస్తే వాటిని ప్రభుత్వమే భరిస్తోంది. భవిష్యత్ లో కరెంట్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చాం.. ఆ మాటను నిలబెట్టుకుం టాం. విద్యుత్ కొనుగోళ్ల ధరలను తగ్గిస్తున్నాం… తద్వారా ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించేలా కృషి చేస్తున్నాం. ఈ ఏడాది యూనిట్కు 29 పైసలు విద్యుత్ కొనుగోలు ధరను తగ్గించాం. భవిష్యత్తులో యూనిట్ పై కొనుగోలు ధరపై రూ.1.19 మేర తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీని ద్వారా ప్రజలపై విద్యుత్భారం తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా మని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ప్రాణమిచ్చే కార్యకర్తలు టీడీపీకే సొంతం
దేశంలో ఏ పార్టీకి లేనంతమంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు. కోటి మంది కార్యకర్తలు పార్టీకి ఉన్నారు. కోటి కుటుంబాలు మన పార్టీకి ఉన్నాయి.. ఇది నా అదృష్టం. గొంతుమీద కత్తి పెట్టినా జై టీడీపీ, జై సీబీఎన్ అని నినదించిన కార్యకర్తలు టీడీపీకే సొంతం. నా జీవితంలో తెలుగు ప్రజలకు, టీడీపీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉన్నాను. ప్రజలు ఓటేయాలన్నా, వారిని నడిపించాలన్నా కార్యకర్తలే ముందుండాలి. టీడీపీ కార్యకర్తలు, వారి త్యాగాలు, కష్టార్జితమే నేను సీఎం కావడానికి కారణం. నాకు ఎన్ని పనులున్నా పార్టీ విషయంలో అశ్రద్ధ చేయను. కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ పనిచేస్తోంది. చని పోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటున్నాం. ప్రత్యేకంగా స్కూలు పెట్టి చదివిస్తున్నాం. కార్యకర్తలను గౌరవ ప్రదంగా చూసుకుంటున్నాం. కార్యకర్తలు ప్రమాదంలో చనిపోతే రూ.5లక్షల బీమాకల్పిస్తున్నాం.
కార్యకర్తలను చూసుకునే బాధ్యత అధినేతగా నాపై ఉంది. నేను ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఇచ్చిన మేనిఫెస్టోను కుటుంబసభ్యులైన మీరు ఇంటిం టికీ తీసుకెళ్లారు. వాటిని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నాం. పాలనలో జవాబుదారీ తనం ముఖ్యం. నేను కార్యకర్తలకు జవాబుదారీగా ఉంటాను. మనంద రం కలిసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రభు త్వం సుదీర్ఘకాలం కొనసాగితేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. కేంద్రంలో 3వసారి మోదీ ప్రధాని అయి దేశం సత్తా చాటారు. గుజరాత్లో 5సార్లు బీజేపీ గెలిచింది. దీన్నీ మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నా… రాష్ట్రాభివృద్ధే ముఖ్యం టీడీపీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిం చింది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నా… రాష్ట్రాభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇచ్చాం. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో నేను కన్వీనర్ గా చేశాను. తరువాత వాజ్పేయ్ హయాంలో ఆరున్నరేళ్లు స్థిర మైన ప్రభుత్వం ఏర్పడేలా సహకరించాం. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తున్నారు…మన వైపు నుంచి మోదీకి అదే సహకారం అందిస్తు న్నాం. దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుండాలి, తెలుగుజాతి అన్నింటా ముందుండాలన్నదే నా కోరిక. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి. అప్పుడే పెట్టు బడులు వస్తాయి, స్వర్ణాంధ్రను సాధిస్తాం. గత ఐదేళ్ల వైసీపీ పాలన తర్వాత రాష్ట్రం ఏమవుతుందోననే ఆందోళనతో ఉన్న వారికి 18నెలల్లో భరోసా కల్పించాం. తెలుగు జాతిలో ఆత్మ విశ్వాసం నింపాం. రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.















