- ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌తో పాఠశాలలకు పూర్వవైభవం
- ఇంటర్మీడియట్ పాఠ్యప్రణాళికలో సమూల మార్పులు
- మౌలిక వసతుల కల్పనపై దృష్టి
- రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం
- ప్రజాచైతన్యంతో డ్రగ్స్‌పై ఉక్కుపాదం
- విద్య. ఐటీశాఖల మంత్రి లోకేష్ ఉద్ఘాటన
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలపై నమ్మకాన్ని పెంపొందిస్తామని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల టీచర్ల కంటే మరింత బాగా ప్రభుత్వ పాఠశాలల, కాలేజీల టీచర్లు పాఠాలు చెబుతారు.. కానీ ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది..దీనికి కారణం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం లేకపోవడమేనన్నారు. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల్లో చదువుతున్న వారి సంఖ్య చాలా తక్కువుగా ఉంది. ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజీల్లో చేరిపోతున్నారు. కొంత మంది చదువు మానేస్తున్నారు.
దీనికి కారణం ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల పై తల్లిదండ్రులకు నమ్మకం లేకపోవడమే. ఆ నమ్మకం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇంటర్ కాలేజీల బలోపేతానికి ముందు ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చెయ్యాలి. అందుకే ఆంధ్రా మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంపొందించి, పూర్వ వైభవం తీసుకురావడం నా బాధ్యత. విద్యార్థులు, తల్లితండ్రులు, టీచర్లే నా బ్రాండ్ అంబాసిడర్లు. దాతలు, పూర్వవిద్యార్థులు, స్వచ్ఛందసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి పాఠశాలను, కాలేజీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు, స్కూళ్లను తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని మంత్రి లోకేష్ తెలిపారు.
సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుంది
ఇక్కడ కళాశాలలో వాతావరణం చూస్తుంటే సంక్రాంతి పండుగ వారం ముందే వచ్చిన్నట్టుగా ఉంది. విద్యా శాఖ మంత్రిగా నాకు ఒక కోరిక ఉంది. టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ ఏప్రిల్‌లో వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన వెంటనే ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఇచ్చే ర్యాంకుల ప్రకటనల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లల ర్యాంకుల ప్రకటనలు వస్తే చూడాలని ఉంది. ఆ రోజు మా పిల్లలు సూపర్ అని నేను కాలర్ ఎగరేసి చెబుతా. ఈ ఛాలెంజ్‌ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా స్వీకరించాలి. చదువు సమాజాన్ని మారుస్తుందని నేను బలంగా నమ్ముతాను. స్టూడెంట్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని చూస్తుంటే నా ఇంటర్ రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజులు మళ్లీ రావు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడంతోపాటు బాగా చదువుకోండి. విద్యార్థి దశలో ఇంటర్మీడియేట్ విద్య చాలా ముఖ్యమైంది. ఈ రోజుల్లో మినిమమ్ డిగ్రీ ఉంటే కానీ మంచి ఉద్యోగం దొరకదు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియేట్ లో చదివే విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకూడదు. ఉన్నత విద్య వరకూ కొనసాగాలి. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది. ఎంతో మంది జీవితాల్లో చీకటి తొలగించి వెలుగులు నింపుతారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దలను విద్యార్థులు గౌరవించాలని మంత్రి లోకేష్ ఉద్బోధించారు.
నేను కూడా ఒకప్పుడు యావరేజి విద్యార్థినే
మంత్రివర్గ కూర్పు సమయంలో సీఎం అడిగితే విద్యాశాఖ మంత్రిగా కావాలని కోరుకున్నా. కష్టమైన శాఖ ఎందుకు అన్నారు, మార్పు తేవాలంటే అయిదేళ్లు చాలదు, పదేళ్లు పడుతుంది అన్నారు. చాలామంది మిత్రులు, సహచరులు.. పరిశ్రమలు, ఐటి వంటి శాఖలు తీసుకోమని సలహా ఇచ్చారు. కానీ విద్యాశాఖను సవాలుగా స్వీకరించి మార్పు కోసం పనిచేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి ఎప్పుడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో పోటీచేశా. 1985 తర్వాత టీడీపీ గెలవని మంగళగిరిలో తొలిసారి ఓడిపోయా. పట్టుదలతో పనిచేసి రెండో సారి పోటీచేసి రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీ సాధించాను. దేవుడి ప్రతిఒక్కరికీ పరీక్ష పెడతారు, జయించే శక్తి కూడా భగవంతుడే ఇస్తాడు. పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు. సప్లిమెంట్ రాసుకొని పాస్ కావచ్చు. టెన్త్ వరకు నేను కూడా యావరేజి విద్యార్థినే. 10వ తరగతి పాసయ్యాక ఇప్పటి మంత్రి నారాయణను పిలచి నన్ను మెరుగ్గా తీర్చిదిద్దాలని చెబితే.. ఆయన నన్ను ఉదయం నుంచి రాత్రి వరకు చదివించి ఉత్తమంగా తీర్చిదిద్దారు. పట్టుదలతో విద్యార్థులు చదువు కొనసాగించి జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకోవాలి. రాబోయే ఏప్రిల్ మీతోపాటు నాకు కూడా పరీక్ష లాంటిది. మెరుగైన ఫలితాలు సాధించి మంచిపేరు తీసుకురావాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
ఇంటర్మీడియట్ పాఠ్యప్రణాళికలో సమూల మార్పులు
ఇంటర్మీడియట్ పాఠ్యప్రణాళికలో సమూల మార్పులు తెస్తున్నాం. ఇంటర్నల్ అసెస్‌మెంట్ పక్కాగా చేస్తున్నాం. ఎంసెట్, నీట్ మెటీరియల్ కూడా వచ్చే ఏడాది నుండి ఇస్తున్నాం. ఉత్తీర్ణతా శాతం పెంచడానికి కాలేజీల వేళలు గంటన్నర పెంచాం. విద్యార్థుల సామర్థ్యాలను బట్టి మూడు గ్రూపులుగా విభజించి ఒక కేర్ టేకర్‌ను ఏర్పాటు చేసి స్టడీ అవర్స్ పెడుతున్నాం. క్వశ్చన్ బ్యాంక్స్ అందజేశాం. ఐఐటి మద్రాస్ సహకారంతో పైలెట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. 29 ఇంటర్మీడియేట్ కాలేజీల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. క్రమం తప్పకుండా పేరెంట్ – టీచర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. టీచింగ్ క్వాలిటీ పెంచడానికి అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. కాలేజీలకు మౌలిక వసతులు, అకడమిక్ పెర్ఫామెన్స్ ఆధారంగా ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తున్నాం విద్యార్థులు బాగా చదువుకొని ఉద్యోగం సాధిస్తే కుటుంబం పరిస్థితి మారిపోతుంది. మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థ
విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నేను మొదటి నిర్ణయం తీసుకున్నాను. నేను మంత్రి అయిన వెంటనే రాజకీయ నాయకుల ఫొటోలు, రంగులు తీసేయాలని ఆదేశాలు జారీ చేసాను. స్కూల్స్‌లో ఒక్క జాబ్ మేళాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నాను. రాజకీయ కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకోని వెళ్ళకూడదు అని గట్టిగా చెప్పా. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా మన చరిత్రను, సంస్కృతిని గుర్తుచేసేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నాం. 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.944 కోట్లతో ఉచితంగా ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్’ పంపిణీ చేశాం. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం’ కింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లను గౌరవిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నాం. టీచర్లు చదువు మాత్రమే చెప్పాలి. ఇతర పనులు, పనికిమాలిన యాప్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
పారదర్శకంగా మెగా డీఎస్సీ
అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం. ఇటీవల టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్) కూడా నిర్వహించాం. ఈ క్రమంలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నాం. కేజీ టూ పీజీ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తెస్తున్నాం. చదువుతో పాటు నైతిక విలువలు చాలా ముఖ్యం. మహిళల్ని గౌరవించడం చిన్న వయస్సు నుండే నేర్పించాలి. అంతకంటే ముందు సమాజంలో మార్పు రావాలి. మహిళలను తక్కువచేసి మాట్లాడే పోకడలు పోవాలి. ఆడ, మగ సమానం అనే భావన కలిగేలా ప్రత్యేక పాఠాలు తీసుకొస్తాం. పిల్లల్లో నైతిక విలువలు పెంచడం కోసం నైతిక విలువల సలహాదారునిగా చాగంటి కోటేశ్వరరావుని నియమించాం. వారి మార్గనిర్దేశకత్వంలో ప్రత్యేక పాఠాలు రూపొందిస్తాం. లైఫ్ స్కిల్స్, సివిక్ అవేర్నెస్, ఆటలు, పాటలు నేర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థులు చదువుతో పాటు అన్ని విషయాల్లో నంబర్ 1 గా ఉండాలి అనేది మన లక్ష్యం.
విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చెయ్యబోతున్నాం. ఒకప్పుడు చంద్రబాబు విజన్ `2020 అంటే నవ్వుకున్నారు, ఈరోజు అదే నిజమైంది. ఇప్పుడు విజన్` 2047 తీసుకొచ్చారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా టీసీఎల్, గూగుల్ వంటి ఐటీి కంపెనీలు, రాయలసీమకు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తెస్తున్నాం. ఆ కంపెనీల్లో పనిచేసేందుకు మానవవనరులు అవసరం. మీరంతా ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేలా తయారు కావాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు.
లెర్నింగ్ అవుట్‌కమ్స్‌పై దృష్టి
విద్యార్థుల లెర్నింగ్ అవుట్‌కమ్స్‌పై దృష్టిపెట్టాం. అన్ని పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. టేబుల్స్, లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్, తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్‌లో ప్రభుత్వ కాలేజీల్లోనే చేరాలనేది నా కోరిక. ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌ను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నాం. గత ప్రభుత్వం ఇంటర్మీడియేట్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం ఆపేసింది, మధ్యాహ్న భోజన పథకం ఆపేసింది. నేను మంత్రి అయ్యిన వెంటనే నిరుపేద కుటుంబాల పిల్లలు మన ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల్లో చదువుతున్నారు.. కచ్చితంగా వారికి టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసాను. సుమారుగా 30 కోట్లు ఖర్చు చేసి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశాం.
ఇప్పుడు 475 ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల్లో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం’ ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం ప్రతి ఏడాది సుమారుగా 86 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నాం. డ్రగ్స్ వల్ల కలిగే విపరిణామాలను వివరిస్తూ డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. డ్రగ్స్‌కు అలవాటుపడితే బతుకు దుర్భరంగా మారుతుంది. అనేక సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులపై తిరగబడి దాడిచేస్తున్నారు. చంద్రగిరిలో పాదయాత్ర సమయంలో ఓ తల్లి తన బిడ్డ గంజాయికి బానిసైందని కన్నీళ్ల పర్యంతమైంది. అందుకే ప్రజా ప్రభుత్వం వచ్చాక ఈగల్ టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేశాం. డ్రగ్స్ రహిత సమాజం ఏర్పాటులో మీరంతా భాగస్వామ్యం కావాలి. ప్రజాచైతన్యంతో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.
డ్రగ్స్ వాడేవారిని వాటికి వ్యతిరేకంగా చైతన్యపర్చండి. డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారితే ఒక తరం మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ సిఎస్‌ఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.