ఢిల్లీ (చైతన్య రథం): పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వేళ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. సమావేశంలో పశ్చిమాసియా యుద్ధ పరిణామాలపై సమీక్షించిన ప్రధాని మోదీ, టీమిండియా స్ఫూర్తితో సమష్టిగా కృషిచేయడమే భేటీ ఉద్దేశమని వివరించినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను సీఎంలకు ప్రధాని వివరించారు. సంక్షోభం దృష్ట్యా భద్రతకు విద్రోహ శక్తులు విఘాతం కలిగించే ప్రమాదముందన్న మోదీ.. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సీఎంలకు సూచించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు వినా మిగతా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ.. యుధ్ధం ప్రభావం పడుతున్నవేళ రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలపై లోతుగా చర్చించారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. వర్చువల్ భేటీకి రాజ్నాథ్్సంగ్, అమిత్ షా హాజరయ్యారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలు హాజరయ్యారు. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి.













