ఇక ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం ఒక ప్రభంజనం. ఆయన నోట ప్రతిధ్వనించిన ఆత్మగౌరవ నినాదం ఒక బ్రహ్మాస్త్రం. “నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ” అంటూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగు వారికి స్వర్ణయుగపు వైభవాన్ని ఇచ్చింది. దేశ రాజకీయాలలో సమూల మార్పులు తెచ్చింది. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తెచ్చింది. బడుగులకు అధికారాన్ని ఇచ్చింది. స్త్రీలకు సాధికారతను ఇచ్చింది. దేశంలో జన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది.
ప్రజల్లోకి వెళ్లి ఏ బేధభావమూ లేకుండా పేదలు, బడుగుల భుజాలపై చేయివేసి… “నీ బాధ తీర్చేందుకే అన్నీ వదులుకుని వచ్చాను” అన్న ఎన్టీఆర్ ను ‘అన్నా’ అని పిలిచారు జనం. సినీ జీవితం ఎన్టీఆర్ ను రాముడుగానో, కృష్ణుడుగానో ప్రతి ఇంటా ఫోటో రూపంలో చూపిస్తే… రాజకీయ జీవితం ఆయనకు ప్రతి తెలుగు హృదయంలో ఏకంగా గుడినే కట్టింది.