తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు ఇరువురూ ప్రజల్లో దూసుకుపోతున్నారు. వారిరువురూ జోడు గుర్రాల మాదిరి విరామమెరుగక పార్టీ రథాన్ని పరుగులు తీయిస్తున్నారు. యువగళం పాదయాత్రతో లోకేష్ జన సునామీ సృష్టిస్తున్నారు. పార్టీ మూలాలను మారుమూల ప్రాంతాలు, అట్టడుగు శ్రేణులు ముంగిటకు తీసుకెళుతున్నారు. ఆన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారిలో భరోసాను నింపుతున్నారు. ప్రజల కష్టాలను కళ్ళారా చూస్తూ, వాటి పరిష్కారానికి ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం, సిఎం జగన్, ఇతర నాయకులపై పదునైన విమర్శలు సంధిస్తున్నారు.
యువగళం పాదయాత్ర ప్రారంభం అయిన కొద్దిరోజుల్లోనే తనను తాను నిరూపించుకొని, భవిష్యత్ ఆశాజ్యోతి గా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అదేవిధంగా తొలుత తేలిగ్గా కొట్టిపారేసిన యువగళం పాదయాత్ర రానురాను రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుండటం అధికార పార్టీ నాయకులలో కలవరం పుట్టిస్తోంది. లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నప్పటికి, వాటిని సమర్థంగా అధిగమిస్తూ ముందుకు సాగుతుండటం అధికార పార్టీలో మరింత గుబులు రేపుతోంది. తనకు ఎదురైన ఆటంకాన్ని తనను తాను నిరూపించుకునే అవకాశంగా లోకేష్ ముందుకు సాగుతున్న తీరు సీనియర్ నాయకులను సైతం అబ్బురపరుస్తోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రోజుకొకరు వంతున యువగళం పాదయాత్రలో పాల్గొంటూ సంఘీభావం తెలుపుతున్నారు.
అదేసమయంలో చంద్రబాబు అదును చూసి తన వ్యూహాలు అమలు పరచసాగారు. ఒకవైపు యువగళం పాదయాత్ర జరుగుతుండగానే, చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. యధావిధిగా ఆ కార్యక్రమానికి సైతం అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. అయితే రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన అపర చాణక్యుడైన చంద్రబాబు ముందు వైసీపీ నాయకుల ఆటలు సాగలేదు. చంద్రబాబు వ్యూహాలతో పాటు ప్రజానీకం సైతం పెద్ద ఎత్తున మద్దతు నీయటంతో అధికార పార్టీ చేష్టలుడిగి చూస్తుండటం మినహా మరేమీ చేయలేకపోయింది. అందుకు అనపర్తిలో జరిగిన సంఘటనే నిదర్శనం.
సిఎం సొంత సామాజికవర్గం అత్యధికంగా వున్న అనపర్తి వంటి చోట ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టడం, ప్రజల ఆకాంక్షలు ఏవిధంగా వున్నాయో స్పష్టం చేస్తుంది. అదే సమయంలో పార్టీ లో సైతం చంద్రబాబు నూతనోత్తేజం నింపుతున్నారు. అయిదు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక జోన్ గా విభజించి, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు లో జోన్ 2 సమావేశం పూర్తయింది. ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ, వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిరోజూ టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలపై సమీక్షలు జరుపుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్థులుగా పోతే చేస్తున్న డాక్టర్ వేపాడ చిరంజీవిరావు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ లను ఎట్టి పరిస్థితులలో గెలిపించాలని, అందుకు నాయకులందరూ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్లక్ష్యం వహించే నాయకులను సహించేది లేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒక వైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ ప్రదర్శిస్తున్న దూకుడు తో అధికార పార్టీకి ఊపిరిసలపటం లేదు.