విశాఖపట్నం (చైతన్యరథం): ఇంటి నుంచి వెళ్లిపోయిన మా కొడుకు వావిలపల్లి చైతన్య నాయుడుని తిరిగి మా దగ్గరకు చేర్చిన మంత్రి నారా లోకేష్ మా పాలిట దేవుడయ్యా…అంటున్నారు రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం బొద్దూరు గ్రామానికి చెందిన వావిలపల్లి వేణుగోపాలరావు, హేమలత దంపతులు.
విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్‌ని శనివారం కలిసిన దంపతులు ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ధైర్యంగా ఉండండి, అండగా ఉంటాం అంటూ మంత్రి ఇచ్చిన భరోసాతో నిరుపేద తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు.
కూలి పనులు చేసి జీవించే వావిలపల్లి వేణుగోపాలరావు, హేమలత దంపతులకు ముగ్గురు అబ్బాయిలు సంతానం. బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటున్న మూడో అబ్బాయి చైతన్య నాయుడు అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఇళ్లు, పుణ్యక్షేత్రాలు, పట్టణాలు వెతికి విసిగి వేసారి పోయారు. స్వామీజీల్ని కలిసి కొడుకు ఆచూకీ కోసం వేడుకున్నారు. చివరికి మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కి వచ్చి వినతిపత్రం అందించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. అబ్బాయి ఉండొచ్చు అనుకున్న ప్రాంతాల్లో పోస్టర్లు అతికించారు. బంధువులు ఇళ్లు గాలించారు. చివరికి హైదరాబాదులో ఉన్న చైతన్య నాయుడు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని అబ్బాయిని క్షేమంగా తల్లిదండ్రులు చెంతకు చేర్చారు. అబ్బాయి ఇంటికి చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. బెంగతో మంచం పట్టిన పెద్దమ్మ అబ్బాయి రాకతో కోలుకుంది.
ఈ రోజు మేము సంతోషంగా ఉన్నామంటే లోకేష్ కారణమని, నా కొడుకును వెతికి మాకు అప్పగించిన పోలీసులు, లోకేష్ ఆదేశాలతో కేసును ఫాలోఅప్ చేసిన సిబ్బందికి రుణపడి ఉంటామని దంపతులు తెలియజేశారు. నిరుపేదలమైన తమకు ఉపాధి చూపించాలని మంత్రి నారా లోకేష్‌ని కోరగా, తప్పనిసరిగా సాయం చేస్తామని హామీ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.