టిడిపి అధికారంలోకి వచ్చాక వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం కర్నూలు కార్ల్ మార్క్స్ నగర్ లో ముస్లిం మైనారిటీ ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
ముఖ్యమంత్రి జగన్ మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది. మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్ ల అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విఫలమయ్యారు. దుల్హన్ పథకానికి ఆంక్షలు పెట్టి ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేసింది.
మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయిస్తామన్న హామీ నెరవేర్చలేదు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది. విదేశీ విద్య పథకాన్ని రద్దు చేసి, పేద ముస్లిం విద్యార్థులకు ఉన్నత విద్యను దూరంచేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి అని వారు కోరారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముస్లింలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ముస్లిం మైనారిటీలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను యథేచ్చగా కబ్జా చేస్తున్నారు. పలమనేరులో మిస్బాను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు.
నంద్యాలలో వైసిపినేతల వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మసీదు ఆస్తుల కబ్జాపై ప్రశ్నించిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా హతమార్చారు. వక్ఫ్ ఆస్తులను, కబరస్తాన్ లను వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారు. ముస్లింల ఉపాధికి ఉపకరించేలా ఇస్లామిక్ బ్యాంక్ ను ఏర్పాటుచేస్తాం. దుల్హన్ పథకాన్ని గతంలో మాదిరిగా కొనసాగిస్తాం. మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్ లను అభివృద్ధి చేస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.