గత టిడిపి ప్రభుత్వంలో రైతులకు అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పునరుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శనివారం భూమయ్యపల్లె గ్రామ రైతులు నారా లోకేష్ ను కలసి సమస్యల గురించి విన్నవించారు. మా గ్రామంలో అధికశాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. గత నాలుగేళ్లుగా ఎరువులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి. నకిలీ విత్తనాలు, పురుగుమందుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం.
గతంలో రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇచ్చేవారు. ఇప్పుడు అవేమీ లేవు. గతంలో ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా బోర్లు మంజురు చేయగా, ఇప్పుడు ఇవ్వడం లేదు. టీడీపీ పాలనలో హార్టీకల్చర్ కు సబ్సిడీపై డ్రిప్ ఇచ్చేవారు, నేడు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. వ్యవసాయరంగంపై అవగాహన లేని జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా కేంద్రాలను రైతు దగా కేంద్రాలుగా మారిపోయాయి, అవి రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు.
వైసీపీ నాయకులే కమీషన్లకు కక్కుర్తిపడి కల్తీవిత్తనాలు, ఎరువుల మాఫియాను పెంచి పోషిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మే వారిని ఉక్కుపాదం మోపుతాం. రైతుల కష్టాలను తెలుసుకున్న చంద్రబాబు ప్రతిఏటా రైతులకు రూ.20వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని మహానాడులో ప్రకటించారు. రైతులకు గతంలో మాదిరిగా 90శాతం సబ్సిడీపై రైతులకు డ్రిప్ పరికరాలు అందిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.