రాజమండ్రి : తెలుగు దేశానికి జనసేన మద్దతివ్వటం ఇదేమి మొదటిసారి కాదని, నవ్యాంధ్ర ప్రయోజనాల దృష్ట్యా సమర్థవంతమైన నాయకత్వం అందించటం కోసం 2014లో తెదేపాకు ఆ పార్టీ మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిచిందని, దరిమిలా అనేక సంక్షేమ కార్యక్రమాలను గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుర్తుచేశారు. అదే బాటలో.. రాష్ట్ర భవిత కోసం మరో సారి కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో నిన్న జరిగిన ఇరుపక్షాల సంయుక్తకార్యాచరణ కమిటి సమా వేశం అనంతరం లోకేష్ పత్రికల వారితో మాట్లాడారు.
బడుగు, బలహీనవర్గాలపై నిరంతర దాడులు :
వైసీపీ పాలనలో విచ్చలవిడిగా దారుణాలు, దురా గతాలు జరుగుతున్నాయని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై జరుగుతున్న దాష్టీ కాలు, సోదరిని వేధించినవారిని ప్రశ్నించినందుకు బాపట్ల జిల్లాలో అమర్నాథ్ అనే యువకుడిని పెట్రోల్ పోసి తగుల బెట్టిన దారుణ ఘటన, డాక్టర్ సుధాకర్ తో మొదలుపెట్టి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరి చేయటం, 25ఎస్సీ సంక్షేమ పథకా లను రద్దుచేయటం జగన్ మానసికతకు అద్దం పడుతు న్నాయని ఆయన వివరించారు. ఆత్మహత్యను పాపంగా పరిగణించే ఇస్లాం మతానికి చెందిన పదేళ్ల పలమనేరు పాప స్కూల్‌లో ఫస్ట్ ర్యాంకు సంపాదిస్తూ తమ పాపకు అడ్డుగా నిలుస్తోందని ఒక వైసీపీ నేత ఆ అమ్మాయిని వేధించి ఆత్మహత్యకు గురిచేయటం ఏం సూచిస్తున్నా యని లోకేష్ ప్రశ్నించారు.
కరువు పట్ల నిర్లక్ష్యం
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కనీసం మరమ్మత్తు పనులు కూడా చేయకుండా, నాచు కూడా తీయకుండా రాష్ట్రంలో 34 లక్షల ఎకరా ల్లో పంట నష్టంతో రైతాంగ దుస్తితికి కారణభూతుడైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తాను, కరువు కవల పిల్లలని నిరూపించుకున్నాడని నారా లోకేష్ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలోను, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలోను మన రాష్ట్రం ఉండటానికి జగన్‌రెడ్డే కారణమని లోకేష్ తెలిపారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాష్ట్రంలో ఏర్పాటు కాలేదని, దరిమిలా నిరుద్యోగం తాండవిస్తున్నా 2లక్షల 30వేల ఖాళీగా ఉన్న ఉద్యోగా లను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి జగన్‌రెడ్డి దాన్ని గాలికి వదిలేశారని..వీటన్నింటి కారణంగా రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్‌రెడ్డి తన అరాచకాలను ప్రశ్నిస్తూ, పోరాటం చేస్తున్నవారిపై దాడులకు దిగజారుతున్నారని, అచ్చెన్నాయుడుతో మొదలైన వేధింపులు నిరాఘాటంగా కొనసాగుతున్నాయని.. అవి చంద్రబాబును అరెస్టు చేసే పరాకాష్టకు చేరుకున్నాయని లోకేష్ వివరించారు. ఏ తప్పు చేశారని చంద్రబాబును అరెస్టు చేశారని ఆయన నిలదీశారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తమ అక్రమాలను జగన్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.పవన్ కల్యాణ్ ఇటీవల మంగళగిరికి రావాలనుకుంటే అడ్డుకుని ఆయన విమానం ఎగరకుండా చేశారని.. తరువాత రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేశారని లోకేష్ గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఈ విధంగా అరాచకాలు జరుగుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఇరు పార్టీల నాయకులు సమావేశమయ్యారని లోకేష్ వివరించారు. పొత్తుకు సంబంధించి ఒక పాత్రికేయుడు సంధించిన ప్రశ్నకు సంధిస్తూ సంకీర్ణ ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి రోజులు తెస్తామని.. నియోజకవర్గాలపరంగా ఏవైనా సమస్యలు ఎదురైతే చర్చించుకుని పరిష్కరించుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.