- వాట్సప్ సమాచారంతో స్పందించిన విద్యా మంత్రి
- దివ్యాంగ విద్యార్థుల సమస్యకు చకచకా పరిష్కారం
- ఒక్క విద్యార్థి.. ఒక్క జీవో.. 24మందికి సీట్లు
- ఐఐటీ, ఎన్ఐటీ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు
- లోకేష్ వేగానికి ఉబ్బితబ్బిబ్బవుతున్న విద్యార్థులు
- రుణం తీర్చుకోలేమంటూ సత్యదేవ్ కృతజ్ఞతలు
అమరావతి (చైతన్య రథం): స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో ఎంబీఏ చేసి చదువు విలువ తెలిసిన రాష్ట్ర విద్య, ఐటీి మంత్రి లోకేష్ చొరవతో 24మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తే మారిపోయింది. ఓ విద్యార్థి తన దృష్టికి తెచ్చిన సమస్యపై లోకేష్ మెరుపువేగంతో స్పందించి భావిభారత పౌరుల బంగారు భవిష్యత్తును భరోసానిచ్చారు. మంత్రి చొరవ ఫలితంగా దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఐఐటి, ఎన్ఐటివంటి విద్యాసంస్థల్లో విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు. విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించాడు. ర్యాంకు ప్రకారం సత్యదేవ్‌కు చెన్నయ్ ఐఐటిలో సీటు రావాలి. అయితే దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు జారీ చేస్తోన్న మార్కుల మెమోలో చాలాకాలంగా చేస్తున్న పొరపాటు దివ్యాంగ విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అదే విషయాన్ని సత్యదేవ్ వాట్సప్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. స్పందించిన లోకేష్ దివ్యాంగుల కోటాలోని విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు.
విజయవాడకు చెందిన సత్యదేవ్ సాధించిన ర్యాంకు ప్రకారం జోసా కౌన్సిలింగ్ రౌండ్ -1లో ఐఐటి మద్రాసులో సీటు కేటాయించారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేయమని అడిగారు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్ట్‌లు రెండిరటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. దీని ప్రకారం సత్యదేవ్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాయలేదు. కాని, ఇంటర్ ‘ఏ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాడు. మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్ట్‌తో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్ట్ మార్కులు ఉంటాయి. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సర్టిఫికేట్లో ఇంటర్మీడియట్ బోర్డు ఎప్పటినుంచో ‘ఈ’ (ఎగ్జంప్షన్) అని మాత్రమే పేర్కొంటోంది. మద్రాసు ఐఐటీ ఇక్కడే అభ్యంతరం తెలిపింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో సత్యదేవ్ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్ ఎ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్ట్‌గా పరిగణిస్తున్నామని, అందువల్ల మీ ఇంటర్మీడియట్ పత్రాన్ని అంగీకరించబోమని సమాచారమిచ్చారు. దీనిపై సత్యదేవ్ ఐఐటి మద్రాసును సంప్రదించగా, సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్లో ‘ఇ’ స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువ కలిగి ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. తన కెరీర్ మొత్తం ఈ ఫలితంపై ఆధారపడి ఉంది. సమస్యనుంచి బయటపడటానికి సహాయం చేయాలంటూ జూన్ 22న మంత్రి లోకేష్‌కు వాట్సప్ మెసేజ్ చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ ఐఐటీిలో ర్యాంకు సాధించిన దివ్వాంగ విద్యార్థి పృధ్వి సత్యదేవ్, అతని తండ్రి జయరామ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మినహాయింపు పొందిన సెకండ్ లాంగ్వేజ్ లో ‘ఈ’ (ఎగ్జంప్షన్)కి బదులుగా మార్కులతో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇవ్వాలని బోర్డు అధికారులకు ఆదేశించారు.
ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించి ‘ఈ’ని కనిష్టంగా 35 మార్కులుగా పేర్కొంటూ…. మెమో జారీచేశారు. తీరా మార్కులతో సర్టిఫికెట్ తీసుకెళ్లిన విద్యార్థికి తాము దీనిని అంగీకరించబోమని, ఏపీ ప్రభుత్వం నుంచి జీఓ కావాలని మెలికపెట్టారు. ఇదే విషయాన్ని పృధ్వీ సత్యదేవ్ మళ్లీ మంత్రి లోకేష్ పేషీకి ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. విషయం తెలుసుకున్న మంత్రి విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినకూడదని, వెంటనే జీఓ విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. అవసరమైతే చెన్నయ్ ఐఐటి అధికారులతో మాట్లాడాలని సూచించారు. వెంటనే ఆగమేఘాలపై జీఓ విడుదల చేశారు. దీంతో పృధ్వీ సత్యదేవ్‌కు ఐఐటి మద్రాసులో సీటు లభించింది. ఈ జీఓ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయస్థాయిలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్‌ఐటి విద్యాసంస్థల్లో సీట్లు లభించాయి. తన భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్‌కు పృధ్వీ సత్యదేవ్‌తోపాటు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో లోకేష్ అందించిన సాయానికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్వేగంతో మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నారు. నేడు ఉండవల్లి నివాసంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్‌ఐటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన దివ్యాంగ విద్యార్థులను విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ అభినందిస్తారు.