- పూర్తిగా విద్యాసంబంధిత సమాచారంతో అకడమిక్ క్యాలెండర్
- నేతల ఫొటోలు, పార్టీల రంగులు లేవు
- ఐదేళ్లుగా జగన్ ఇచ్చింది వైసీపీ క్యాలెండర్
అమరావతి(చైతన్యరథం): చదువు విలువ తెలియని జగన్ తన ఐదేళ్ల పాలనలో అకడమిక్ క్యాలెండర్‌ని వైసీపీ క్యాలెండర్‌లా తన బొమ్మలు, పార్టీ రంగులతో నింపి వదిలేవాడు. విద్య విలువ తెలిసిన కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్.. టీచర్లు, విద్యార్థులను ఆకట్టుకునేలా అకడమిక్ క్యాలెండర్ ఉండాలని పట్టుబట్టి మరీ చెప్పి అదే విధంగా డిజైన్ చేయించి రిలీజ్ చేశారు. నారా లోకేష్ ఆదేశాలతో విడుదలైన అకడమిక్ క్యాలెండర్‌లో సీఎం చంద్రబాబు ఫోటోలు లేవు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఫోటో కూడా లేదు. ఉన్నదంతా సమాచారం మాత్రమే. చివరికి టీడీపీ, జనసేన, బీజేపీ రంగుల్లో ఏ ఒక్కటీి క్యాలెండర్‌కి పూయలేదు. గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్లలో మొత్తం జగన్ బొమ్మలే ఉండేవి. అంతే కాకుండా వైసీపీ రంగులు పులిమి ఉండేది. ఇప్పుడు లోకేష్ అందుకు భిన్నంగా అకడమిక్ క్యాలెండర్‌లో రాజకీయాలకు తావు లేకుండా చేయటం విశేషం.
యువకుడైనా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ తన ప్రజాస్వామ్యబద్ధమైన పనితీరుతో ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. విద్యాశాఖ అంటే ఒక పరీక్ష. ఛాలెంజ్ గా తీసుకుని విద్యాశాఖలో విప్లవాత్మకమైన పద్ధతులు ప్రవేశపెడుతూ విద్యార్థులు, టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రశంసలు అందుకుంటున్నారు. విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న పథకాలకు స్పూర్తిప్రదాతల పేర్లు పెట్టి విద్యావేత్తలు, మేధావుల మన్ననలు పొందారు. విద్యాశాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ బదిలీలు రద్దుచేసి పారదర్శకతకు తాము ఎంత ప్రాధాన్యం ఇస్తామో చెప్పకనే చెప్పారు. 16 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ వేసి నిరుద్యోగుల పాలిట ఆశాకిరణం అయ్యారు. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా.. విద్యార్థులు-వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంఘాలతో చర్చించి మాత్రమే తీసుకుంటామని ప్రకటించి అలాగే చేస్తున్నారు.
టీచర్లు చూడగానే వారికి అకడమిక్ క్యాలెండర్ అనిపించేలా..క్లాసులో అతికిస్తే విద్యార్థులు ఆసక్తిగా చూసేలాగా తీర్చిదిద్దిన అకడమిక్ క్యాలెండర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని పని దినాలు ఉండబోతున్నాయి, ఎన్ని సెలవులు ఇస్తున్నారు, పాఠశాలల టైమింగ్స్, పరీక్షలు, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు ఇలా అన్ని వివరాలను ఇందులో పొందుపరిచారు. మార్పు రావాలని కోరుకోవడం కాదు..మార్పు తన నుంచే ప్రారంభించి ఆదర్శంగా నిలుస్తున్నారు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.