- రైతాంగానికి మేలు జరిగేలా యుద్దప్రాతిపదికన అత్యవసర పనులు
- గత ప్రభుత్వంలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం.
అమరావతి,చైతన్యరథం: రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంట కాలువల శివారు ప్రతి ఎకరానికి నీరు అందేలా అధికారులంతా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురు కాకూడదన్నారు. అన్నదాతకు మేలు జరిగేలా కాలువలు, డ్రైన్ల లో అవసరమైన ప్రక్షాళన పనులను యుద్ధ ప్రాతిపదికన పది రోజుల్లో మొదలు పెట్టేలా సమాయత్తం కావాలన్నారు. సచివాలయంలో మంగళవారం మంత్రి తన ఛాంబర్ లో జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, సలహాదారులుఎం.వెంకటేశ్వర రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి లతో కలిసి శాఖకు సంబంధించిన ఉన్నత ఇంజనీరింగ్ అధికారులు, అన్ని జిల్లాల ఎస్ ఇ. లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్ష చేశారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గత ఐదేళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు, ఏటిగట్లు వంటి పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి అన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు, నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగించారన్నారు. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగానికి మేలు జరగాలనే ఉద్దేశంతో బడ్జెట్ ఇబ్బందులు ఉన్నా ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సుముఖత తెలిపారన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకాకుండా పంట కాలువలు, మురుగు, డ్రైన్ల లో ప్రక్షాళన పనులు పది రోజుల్లోగా చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రధానంగా తూడు, గుర్రపు డెక్క, మట్టి తొలగింపు పనులు చేపట్టాలన్నారు. కాలువలు, డ్రైన్ల లో లాకులు, అవుట్ స్లూయిస్, షట్టర్ తలుపుల మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు.
ఈ ఏడాది ఈ పనులు చేపట్టాలంటే ఏప్రిల్ నాటికి ప్రతిపాదనలు, మే నెలలో టెండర్లు ఖరారు వంటివి జరిగితే వేసవి లో పనులు జరిగి ఉండేవని, వీటిపై ఎందుకు దృష్టి పెట్టలేదని అధికారులను మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చిన్నపాటి వర్షానికి వేలాది ఎకరాల పంట పొలాలు ముంపుకు గురై రైతాంగం ఆర్థికంగా నష్టపోయిం దన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో గోదావరి ఏటి గట్ల పటిష్టతకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఏటి గట్లు బలహీన ప్రాంతాల్లో అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో పోలవరం తోపాటు ఇతర ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విధ్వంసానికి గురయ్యాయి అన్నారు.
ప్రధానంగా అన్నమయ్య, ఫించా, గండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టులను పట్టించుకోక పోవడంతో అవి ధ్వంసమైన విషయం తెలిసిందే అన్నారు. సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టుల వద్ద, రిజర్వాయర్ వద్ద మరమ్మతు పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. నదుల అనుసంధానం ద్వారా కరువు రహిత రాష్ట్రంగా సస్య శ్యామలమయ్యే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలిపారు. ధవళేశ్వరం, నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి విడుదల చేసే నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అన్నదాతకు సేవ చేసే మహాభాగ్యం నీటి పారుదల శాఖ కు ఉన్న ఒక అద్భుతమైన అవకాశం అని మంత్రి రామా నాయుడు పాత్రికేయులకు స్పష్టం చేశారు.