- రాజమండ్రి ప్రజలను ఎన్నటికీ మరువలేను
- ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్‌బ్యాంక్ ప్రారంభిస్తూ నారా భువనేశ్వరి భావోద్వేగం
రాజమండ్రి (చైతన్యరథం): ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేసారు. 1997లో ప్రారంభించిన ట్రస్ట్.. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం, వంటి కార్యక్రమాలను కొనసాగిస్తోందని ఆమె తెలిపారు. సేవే లక్ష్యంగా ప్రజలకు సహాయం చెయ్యడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుటుందన్నారు. రాజమండ్రిలోని ప్రకాష్ నగర్‌లో గోరంట్ల శాంతారావు (జీఎస్సార్) మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ‘‘ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్’’ ను సోమవారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ సీఈవో రాజేంద్రకుమార్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకట లక్ష్మి, ఎండీ డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి ప్రజలు తనను తోబుట్టువులా ఆదరించి, తమ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారన్నారు. అప్పట్లో ఎంతో బాధలో ఉన్నప్పటికీ ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ఇస్తున్న భరోసాతో ధైర్యం తెచ్చుకున్నానన్నారు. మాకు ఆశ్రయం ఇచ్చి అండగా నిల్చి, నన్ను ముందుకు నడిపించిన రాజమండ్రి ప్రజలు నా కుటుంబ సభ్యులు. వారిని ఎన్నటికీ మరువలేనన్నారు. రాజమండ్రి ప్రజలు, దాతలు గురించి ఎంత చెప్పినా తక్కువేనని, వారందరికీ పాదాభివందనాలు అని ఆమె పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్ ఎక్కడ పెట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు రాజమండ్రిలో తప్పకుండా పెట్టాలని, వెంటనే ప్రారంభించి రుణం తీర్చుకోవాలని అనుకున్నాను. డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముందుకొచ్చి సహకరించారు. ఆయన తల్లి వెంకటలక్ష్మి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సహకారం వల్లనే ఇది సాధ్యపడిరదని భువనేశ్వరి స్పష్టం చేసారు.
మరెన్నో కార్యక్రమాలు..
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని భువనేశ్వరి చెబుతూ 4వ ది రాజమండ్రిలో ప్రారంభించామన్నారు. దాతల నుంచి 4 లక్షల 8 వేల యూనిట్లు రక్తం సేకరించి, అవసరమైన వారికి ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. బాలికల విద్య కోసం గండిపేటలో జూనియర్ కళాశాల ప్రారంభించామని, 2 కోట్ల రూపాయల మేర స్కాలర్‌షిప్‌లు అందించామని ఆమె తెలిపారు. ట్రస్ట్ ప్రారంభించిన ఈ 27ఏళ్ళ ప్రస్థానంలో సహకరించిన దాతలకు, వాలంటీర్లకు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ పక్షాన ఆరోగ్య సంరక్షణకు సంజీవిని, మొబైల్ క్లినిక్స్ ప్రారంభించామన్నారు. కుప్పం, సాలూరు, వంటి చోట్ల క్లినిక్ లు ఉన్నాయని, ఆమె తెలిపారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ ద్వారా 13,542 హెల్త్ క్యాంపులు నిర్వహించి 20 లక్షల మందికి వైద్య సేవలు అందించామన్నారు. 21కోట్ల 60లక్షల రూపాయల మందులు ఉచితంగా అందించినట్లు భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ సుజల ద్వారా క్లస్టర్ ప్లాంట్లు నిర్మించామన్నారు. గోదావరి వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్నామని, ఇవన్నీ తమ వాలంటీర్ల వల్లనే సాధ్యపడ్డాయని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ మరెన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తుందని భువనేశ్వరి తెలిపారు.
ఏ పార్టీ చేయని విధంగా: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి
రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్న కార్యక్రమాలు అద్వితీయమన్నారు. వేల కోట్ల రూపాయల నిధులున్న పార్టీలేవీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ద్వారా లక్షలాది మందికి వైద్యం అందిస్తుండగా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేసారు. తమబోటి వాళ్ళం ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు మాత్రమే చేయగలమని, ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు నలుమూలలా వ్యాపించాయని అయన అన్నారు.
డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, అవసరమైన సమయంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ బ్లడ్ బ్యాంకు నెలకొల్పాలని భావించి, అడిగిందే తడవుగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు భువనేశ్వరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా తలసీమియా వ్యాధిగ్రస్తులైన ఇద్దరు చిన్నారులకు భువనేశ్వరి చేతుల మీదుగా పౌష్టికాహారం అందించారు.
తలసీమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందిస్తామని ట్రస్ట్ సీఈవో రాజేంద్రకుమార్ చెప్పారు. దాతలు కూడా సహకరించాలని కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలను ఆయన వివరించారు.
అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అంబులెన్స్‌ను నారా భువనేశ్వరి జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ఐఎంఏ అధ్యక్షుడు డా గురుప్రసాద్, డాక్టర్ అగస్త్యరాజు శ్రీనివాసరాజు, పలువురు వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.