- కూటమికి ఎదురొచ్చి నిలిచేదెవరు?
- రాష్ట్రం కోసమే మూడుపార్టీల పొత్తు
- ఆంధ్రను వైసీపీ నాశనం చేసింది..
- కోనసీమను స్వర్ణసీమ చేసి చూపిస్తాం
- జగన్ కోసం వాలంటీర్లు జాబులు వదులుకోకండి
- అమలాపురం ప్రజాగళంలో చంద్రబాబు
- అధికారులు ఎన్నికల కోడ్ పాటించాలని హితవు
అమలాపురం (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్నివిధాలా నష్టపోయిందని, అరాచక పాలననుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు మాట్లాడారు. ‘మా జోడి సూపర్ డూపర్ హిట్. మమ్మల్ని తట్టుకుని ఎవరైనా నిలబడగలరా? ప్రశాంత కోనసీమను దుర్మార్గులు మరో పులివెందుల చేయాలనుకుంటున్నారు. నేను చేయనిస్తానా?’ అన్నారు. మూడు పార్టీల అజెండా ఒక్కటే. అందాల కోనసీమను బంగారు సీమగా తయారు చేయాలన్నదే మా ఆలోచన అంటూ, ప్రశాంతమైన కోనసీమలో 10 రోజులు ఇంటర్నెట్ కట్ చేసే పరిస్ధితి ఎందుకొచ్చింది? దీనికి కారణం వైసీపీ పాలన కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
రాష్ట్రం కోసమే పొత్తు
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, అవినీతిపరుడు, అహంకారి రాష్ట్రాన్ని నాశనం చేశాడని జగన్‌పై నిప్పులు చెరిగారు. 2014లో ఎన్డీయే ప్రభుత్వ కూటమి ఏర్పాటు చేసి విభజన చట్టంలోని అన్ని హామీలు సాధించాం. ఎయిమ్స్ సహా 11 విద్యా సంస్ధలు తీసుకొచ్చాం. కేంద్రం సహకారంతో పోలవరం 72 శాతం పూర్తి చేశాం. అది పూర్తయి ఉంటే నేడు గోదావరి జిల్లాలకు నీళ్లొచ్చేవి. కానీ జగన్ పోలవరాన్ని ఆపేశాడని, 3 ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని దుయ్యబట్టారు. తెదేపా హయాంలో అన్ని విధాలా అభివృద్ధి సాధించిన రాష్ట్రం, జగన్ పాలనతో సర్వనాశనమైందన్నారు. టీడీపీ హయాంలో వ్యవసాయం, ఆక్వా, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ఆరోగ్య సూచిక, విద్యా ప్రమాణాల్లో నెం.1 స్ధానంలో ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చామన్నారు. కానీ నేడు ఏ రైతు అయినా ఆనందంగా లేడని, కోనసీమలో సైతం రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి అప్పుల పాలయ్యే పరిస్థితి ఉందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లతో యువతలో నైపుణ్యం పెంచుతామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఐటీ టవర్స్ ఏర్పాటు చేసి, కోనసీమను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జగన్ సంక్షేమం గోరంత, ప్రచారం కొండంత అని ఎద్దేవా చేస్తూ, కూటమి ప్రభుత్వం అంతకుమించి సంక్షేమం అందిస్తుందని హామీ ఇచ్చారు. పాలన చేయమని ప్రజలు అధికారం ఇస్తే మాఫియాను నడుపుతూ జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నాడని విరుచుకుపడ్డారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్ని దోపిడీకి గురయ్యాయన్నారు. భూపరిరక్షణ చట్టమంటూ ప్రజలు భూములు లాగేయడానికీ ప్రణాళిక వేశాడని, చట్టం వస్తే ఎవరి భూములు వారి పేరుమీద ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. 99 శాతం మ్యానిఫెస్టో హామీలు అమలు చేశానని అబద్ధాలు చెబుతున్న జగన్, ప్రతిసారి బటన్ నొక్కానని అంటున్నాడు, అందులో జగన్ బొక్కిందెంత? వైసీపీ వాళ్లు దోచించెంత? అని ప్రశ్నించాఅ.
జగన్‌వి దింపుడు కళ్లెం ఆశలు
పవన్ డబ్బుల కోసం రాలేదు. ప్రజల కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం వచ్చారు. పవన్‌పై, నాపై జగన్ బూతులు తిట్టిస్తున్నారు. ప్రజాగళం ఉత్సాహం తుపాన్‌ను తలపిస్తుందని, ఈ తుపాన్‌లో జగన్ కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు. పవన్ మీద అభిమానం అంటే సరిపోదు. పవన్ చెప్పినట్టు మీరంతా కూటమి అభ్యర్దులకు ఓట్లేయాలి. టీడీపీ ఓట్లు జనసేనకు, జనసేన ఓట్లు టీడీపీకి పడవని జగన్ దింపుడు కళ్లం ఆశతో ఉన్నాడు. అభ్యర్ది ఏ పార్టీ అయినా 3 పార్టీలవారు ఆ అభ్యర్దికే ఓటు వేయాలి. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. ఓటు చీలడానికి వీలు లేదు, వైసీపీని పాలనను అంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో ప్రతి స్కీమ్ స్కాం..
ఇళ్ల పట్టాల పేరుతో అమలాపురంలో 100 ఎకరాలు సేకరించారు. ఎకరాకు రూ.10 లక్షలపైగా స్ధానిక మంత్రి, ఆయన అనుచరులు మింగేశారు. మెడికల్ కాలేజీ పేరుతో రైతుల దగ్గర 50 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వం రూ.78 లక్షలిస్తే రైతులకు రూ.50 లక్షలే చెల్లించారు. మిగతా సొమ్మంతా మంత్రి దోచేశారు. పట్టణ మున్సిపాలిటి పార్కింగ్ స్ధలం కూడా మంత్రి అనుచరులు అద్దెకు తీసుకున్నారు. ఆక్వా చెరువు తవ్వాలంటే కప్పం కట్టాలి. వైసీపీ దోపిడీని ఇక సహించేది లేదన్నారు. ఎన్టీయే అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులకు 1.50 పైసలకే కరెంట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
సూపర్ – 10
ప్రజల కోసం సూపర్ సిక్స్ పధకాలు రూపొందించాం. వాటికి మరో నాలుగు అంశాలు పవన్ కళ్యాణ్ జత చేశారు. సూపర్ 10తో మీ ముందుకొస్తున్నాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ. నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఎంతమంది విద్యార్దులున్నా… ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలిస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. యువతకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి. రైతులకు ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తాం. ఫించన్ రూ.4 వేలకు పెంచి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకే తెచ్చి ఇస్తాం. ఏప్రిల్ నెల నుంచే రూ. 4 వేల ఫించన్ ఇస్తాం. వికలాంగుల ఫించన్ రూ.6 వేలకు పెంచుతామని చంద్రబాబు వివరించారు.
జగన్ ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు
ఎన్టీయే అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల జీతం రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. జగన్ వారికి రూ.5 వేలిచ్చి ఊడిగం చేయించుకుంటున్నారు. వాలంటీర్లు రాజకీయాలకు దూరంగా ఉండండి. రాజీనామాలు చేసి వైసీపీకి సహకరించొద్దు. రాజీనామాలు చేస్తే మళ్లీ మీ ఉద్యోగం రాదు. జగన్ ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు పొగ్గొట్టుకోవద్దు. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే అన్నారు.
నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తాం
అమలాపురం నియోజకవర్గంలో త్రాగునీరు, డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామని, కొబ్బరి రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ప్రభుత్వమిచ్చే రూ.24 వేలు పధకం కొనసాగిస్తామన్నారు. ఇసుక మాఫియాతో నష్టపోయిన 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని, అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. అమలాపురం నుంచి రామచంద్రాపురం, మండపేటను కలుపుతూ కోటిపల్లిపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, బాలయోగి చిరకాల వాంచ కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ పూర్తి చేస్తామన్నారు. శెట్టిబలిజలకు కళ్యాణ మండపం నిర్మిస్తామని, మాల సమాజం అభివృద్ధికి పాటుపడ్డ పీవీ రావు ఘాట్ నిర్మాణానికి నిధులిస్తామని హామీ ఇచ్చారు. కాపు, అగ్నికుల క్షత్రియ, మిగతా బీసీల కులాలను ఆర్దికంగా పైకి తీసుకొస్తామని హామీనిస్తూ, కూటమికి ఓటేసి గెలిపించేందుకు మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలని పిలుపునిచ్చారు.
అధికారులు ఎన్నికల కోడ్ పాటించాలి
ఓటమి భయంతోనే పవన్ పర్యటనలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైజాగ్‌లో ఉన్న పవన్ హెలికాప్టర్ రాకుండా కుట్రపన్నారు. ఖబడార్ జాగ్రత్త. అధికారులంతా ఎన్నికల కోడ్ పాటించాలి. మాకు వర్తించిన రూల్సే జగన్‌కి వర్తించాలి. జగన్ పదవీకాలం అయిపోయింది. సంస్కారం లేని జగన్‌లాంటి వ్యక్తులు సీఎం కుర్చీలో కూర్చోడానికి అనర్హులు. ప్రజలంతా టీడీపీ, జనసే, బీజీపీ కూటమిని ఆశీర్వించాలని చంద్రబాబు కోరారు.