- సిద్ధమైన కార్యాచరణ
- త్వరలో కొలంబియా వర్శిటీ బృందం పర్యటన
- వ్యాధిమూలాలు కనుగొని నివారణ మార్గాలపై దిశానిర్దేశం
- ఐదేళ్లలో జగన్‌రెడ్డి చేసింది శూన్యం
అమరావతి(చైతన్యరథం): దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని కబళిస్తున్న కిడ్నీ వ్యాధికి కళ్లెం వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందించారు. వ్యాధి మూలాలు కనుగొని నివారించేందుకు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ బృందం త్వరలో ఉద్దానంలో పర్యటించనుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా కిడ్నీ వ్యాధి సమస్య ఒక్క శ్రీకాకుళం జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని పలు జిల్లాలకూ ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపించింది. గతంలో తిత్లీ తుపాను కారణంగా కకావికలమైన ఉద్దానం ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిడ్నీ బాధితుల సమస్యలను చూసి చలించిపోయారు.
యుద్ధ ప్రాతిపదికన పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రంతో పాటు 200 పడకల సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి నిర్మిస్తే కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అదుతుందని భావించి 4.50 ఎకరాల స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు. ఇంతలో ఎన్నికలు రావడం జగన్ అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు అది చేశాం…ఇది చేశామని ఐదేళ్లూ ప్రచారార్భాటమే కానీ జగన్ రెడ్డి చేసిందేమీ లేదు. తూతూమంత్రంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగన్ రెడ్డి మళ్లీ అటు వైపు చూసిందే లేదు. నిర్మాణ పనులు ఎంత వరకూ వచ్చాయో పట్టించుకున్నదీ లేదు. హామీలు గుప్పించి అరచేతిలో వైకుంఠం చూపించి చేతులు దులుపుకున్నాడు.
కిడ్నీ బాధితులకు చంద్రబాబు చేసింది..
కిడ్నీ బాధితులకు తొలిసారిగా రూ. 2500 పెన్షన్ మంజూరు. 1,20,000 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు. 27 రకాల ఉచిత మందుల పంపిణీ. పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో ఐదు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు. రూ. 1900 కోట్ల వ్యయంతో ఉద్దానంలో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం-తొలి విడతగా రూ. 468 కోట్లు ఖర్చు. రూ. 2 కే స్వచ్ఛమైన నీరు పంపిణీ.పలాసలో రూ. 50 కోట్ల వ్యయంతో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటుతో పాటు 200 పడకల సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి నిర్మాణానికి 4.50 ఎకరాల స్థలం కేటాయింపు. ఉద్దానం ప్రాంతంలో కలుషిత నీటి వల్లే వ్యాధులు పెరుగుతున్నాయని పరిశోధనల్లో తేలడంతో 2018లో ఎన్టీఆర్ సుజల పథకం అమలు చేసి ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో 167 మినీ ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా.
కిడ్నీ బాధితులను గాలికొదిలేసిన జగన్ రెడ్డి
కిడ్నీ బాధితులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు చేపట్టిన సుజలధార ప్రాజెక్టును జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. 2019లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సమయంలో 2022 కు పూర్తి చేసేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేశారు.
ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు కనీసం పైపు లైన్లు, ట్యాంకులు, కుళాయిల పనులు సగం కూడా పూర్తికాలేదు. ఒక్క పనీ పూర్తికాకుండా 807 గ్రామాలకు నీరు సరఫరా చేస్తామని బూటకపు ప్రచారం చేశారు. అలాగే రూ. 700 కోట్ల్ల విలువైన సుజలధార ప్రాజెక్టుకు మొత్తం నిధులు తమ ప్రభుత్వమే వ్యయం చేసినట్టు జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకున్నాడు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ 50% , రాష్ట్ర వాటాగా నాబార్డు నుంచి 50% నిధులతోనే ప్రాజెక్టులు పనులు జరిగాయి.
కిడ్నీ బాధితులకు రూ. 10 వేల పెన్షన్ విషయంలో జగన్ రెడ్డి మోసమే చేస్తున్నాడు. వేలాదిమంది వ్యాధితో బాధపడుతుంటే కేవలం వందల మందికే పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. గత ఐదేళ్లలో ఉద్దానంలో రోగులకు ప్రభుత్వం నుంచి వైద్యం సరిగా అందలేదు. వారికి కావాల్సిన మందులు అరకొరగా అందించారు. వైద్యుల కొరత తీర్చలేదు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులకు అందాల్సిన వైద్య సేవలూ అంతంతమాత్రంగానే అందాయి.