- ఖరీఫ్‌లో శివారు భూములకు సాగునీరు అందజేస్తాం
- రెండు, మూడురోజుల్లో కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీరు
- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పులిచింతలలో నీరు ఖాళీ
- గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజెక్టుల గేట్లు కూడా కొట్టుకుపోయాయి…
- రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి : రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదిన చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలి పారు. వర్షాకాలంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలవనరుల శాఖ ఇంజనీర్లతో సచివాలయంలో శుక్రవారం మంత్రి సమీక్షిం చారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వర్షాకాలంలో పెద్దఎత్తున వరద నీరు ప్రాజెక్టుల్లోకి చేరనున్న నేపథ్యంలో ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, గేట్లు, లాక్‌ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుతూ ప్రాజెక్టుల పరిధిలోని శివారు ఆయకట్టు భూమికి కూడా సాగు నీరు అందే విధంగా కాలువల్లో పేరుకుపోయిన తూము కాడ, చెత్తాచెదారాన్ని వెంటనే తొల గించే పనులను చేపట్టాలని, అందుకు అవసరమైన నిధుల అంచనాలను రూపొందించాలని ఆదేశించినట్లు చెప్పారు. జల వనరులను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకుని ఖరీఫ్‌లో శివారు భూములకు కూడా సాగునీరు అందజేయాలనే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన నిర్వహణ పనులను చేపడుతున్నామని వివరించారు. ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు భూములకు ప్రణాళికా బద్ధంగా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయని, పులిచింతల ప్రాజెక్టులో నిల్వఉండాల్సిన 30 నుంచి 40 టీఎంసీ లకు బదులు కేవలం 0.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని, ఇటువంటి పరిస్థితులు తమ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. పులిచింతల ప్రాజెక్టులో తగిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం, పట్టిసీమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన కారణంగా నేడు కృష్టా డెల్టాలో తాగునీటి సమస్య తలెత్తడానికి కూడా గత ప్రభుత్వమే కారణమన్నారు. నాలుగేళ్లుగా పట్టిసీమ నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో గేట్లు, బోల్టులు కూడా తుప్పుపట్టి పోవడంతో పాటు లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కింద 24 పంపుల్లో మూడు పంపులతో పథకాన్ని ప్రారంభించి ప్రస్తుతం 15 పంపులు పనిచేస్తున్నాయని, రానున్న మూడు, నాలుగురోజుల్లో మొత్తం 21 పంపులు పనిచేసే అవకాశం ఉందని వెల్లడిరచారు. ఫలితంగా రానున్న రెండు, మూడు రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణకు ఏ మేరకు నిధులు వెచ్చించారో అన్న విషయాన్ని ఆరా తీస్తున్నామని, ఈ ఏడాది ఎంత మేరకు నిధులను వెచ్చించగలమో అంచనా వేస్తున్నామ న్నారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టుల నిర్వహణ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్నట్లు తెలిపారు.