- ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటా
- సంస్థ నూతన చైర్మన్ కర్రోతు బంగార్రాజు కృతజ్ఞతలు
- మేళతాళాలతో అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ
- హాజరైన పలువురు ముఖ్యనాయకులు
విజయవాడ(చైతన్యరథం): తనపై నమ్మకంతో మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటానని సంస్థ నూతన చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. విజయవాడలోని మార్క్‌ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం చైర్మన్‌గా బంగార్రాజు బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలతో ఎంతో అట్టహాసంగా బంగార్రాజు బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. మార్క్‌ఫెడ్ ఎండీ మనజీర్ జీలాని సమూన్ ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బంగార్రాజుతోపాటు డైరెక్టర్లుగా నియమితులైన అన్నేపు రామకృష్ణ నాయుడు (శ్రీకాకుళం), పరసా వెంకటరత్నం (సుళ్లూరుపేట), కేసీ హరి (అనంతపురం), వంగల శశిభూషణ్ రెడ్డి (కడప), గుండుభోగుల నరసింహారావు (రాజోలు) బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయంలో బంగార్రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రుణపడి ఉంటాననిన్నారు. తనకు ఇచ్చిన పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందేలా చూస్తామన్నారు. పప్పుధాన్యాలకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పసుపు, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్, మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావు, విశాఖ నార్త్ నియోజకవర్గం ఇంచార్జ్ సువ్వాడ రవిశేఖర్, భోగాపురం మండల టీడీపీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం విజయవాడ పట్టణ అధ్యక్షుడు మహంతి వాసుదేవరావు, టీడీపీ పార్లమెంట్ ప్రతినిధి గేదల రాజారావు, నెల్లిమర్ల టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కడగల ఆనంద కుమార్, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.