అమరావతి,చైతన్యరథం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 27వ తేది గురువారం సాయంత్రం 4గం.ల నుండి రాత్రి 7గం.ల వరకు విజయవాడ సమీపంలోని కానూరు 100 అడుగుల రోడ్డు వద్ద గల ప్రాంతంలో ఈనాడు గ్రూపుల సంస్థ అధినేత దివంగత రామోజీరావు సంస్మరణ సభ జరగనుంది.ఈ సంస్మరణ సభ ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ,ఎక్సైజ్ శాఖామాత్యులు కొల్లు రవీంద్ర,రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కె.పార్థసారథి,రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తోకూడిన మంత్రుల బృందం అధికారులతో సమీక్షించింది.
ఈసందర్భంగా వివిధ శాఖల వారీగా చేపడుతున్నఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రివర్గ సభ్యులు,కేంద్ర మంత్రులు,ఇతర ప్రజా ప్రతినిధులు,సినీ,పత్రికా,మీడియా,వ్యాపార,వాణిజ్య, రచయితలు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు సుమారు 7వేల మందికి పైగా ఈసంస్మరణ సభకు హాజరు కానున్న నేపధ్యంలో ఈకార్యక్రమాన్నివిజయ వంతం చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది.
ఈ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ,ఎన్టిఆర్ జిల్లా సంయుక్త కలక్టర్ జి.సంపత్ కుమార్ ఈసంస్మరణ సభకు సంబంధించి చేస్తున్నపలు ఏర్పాట్లను మంత్రులకు వివరించారు. ముఖ్యంగా ప్రధాన వేదిక,దాని ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను,హాజరు కానున్న ప్రముఖులకు సంబంధించి చేస్తున్నవసతి,రవాణా ఇతర ఏర్పాట్లు తదితర అంశాలపై వివరించారు.దివంగత రామోజీరావు జీవిత చరిత్రకు సంబంధించిన పొటో ఎగ్జిబిషన్ తోపాటు, ఆడియో వీడియో ప్రదర్శన వంటివి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈసమావేశంలో సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత,జాయింట్ డైరెక్టర్లు టి.కస్తూరి భాయి,ఎస్.సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.