- అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు
- ఎంపీపీ ఛాంబర్ తాళాలు ఇవ్వనందుకు దారుణం
గాలివీడు (చైతన్యరథం): అన్నమయ్య జిల్లాలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి, 20 మంది అనుచరులతో కలిసి శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని అడగ్గా.. ఎంపీపీకి మాత్రమే ఛాంబర్ తాళాలు ఇస్తామని ఎంపీడీవో స్పష్టం చేశారు.
దీంతో మాకే ఎదురు చెబుతావా.. అంటూ జవహర్ బాబుపై సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. కుర్చీలో నుంచి కిందపడిపోయినా ఆగకుండా కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు గుద్దారు. తీవ్రంగా గాయపడిన ఎంపీడీవో జవహర్ బాబును పోలీసులు రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దాడిలో పాల్గొన్న అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు.
వైసీపీ నేతల నుంచి ప్రాణహాని: ఎంపీడీవో
తనపై దాడి జరిగిన తీరును మీడియాకు వివరిస్తూ ఎంపీడీవో జవహర్ బాబు కన్నీటి పర్యంతమయ్యారు. గది తాళాలు ఇవ్వనందుకు వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి, ఆయన 20 మంది అరుచరులు నన్ను విచక్షణారహితంగా కొట్టారు. అడొచ్చిన నా మేనల్లుడిని కూడా కొట్టారు. దాడి తర్వాత అరగంట పాటు కార్యాలయంలోనే ఉన్నారు. రాత్రిలోగా నన్ను చంపేస్తామని సుదర్శన్ రెడ్డి హెచ్చరించాడు. అతను చాలా సందర్భాల్లో అనుచరులతో వచ్చి ఎంపీపీ గదిలో మద్యం సేవించేవారు. ఇవాళ ఉదయం గది తాళాలు ఇవ్వలేదని మూకుమ్మడిగా దాడి చేశారు. వైసీపీ నేతల నుంచి నాకు ప్రాణ హాని ఉంది. ప్రభుత్వం నాకు రక్షణ కల్పించాలని జవహర్ బాబు కోరారు.
ఉద్యోగులపై దాడులు సహించం: మంత్రి మండిపల్లి
ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత దాడిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఖండిరచారు. ఈ అంశంపై అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీతో మంత్రి మాట్లాడారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన ఎంపీడీవోకు ఫోన్ చేసి పరామర్శించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడికి పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
డిప్యూటీ సీఎం పవన్ ఖండన
అన్నమయ్య జిల్లాలో ఎంపీడీవో జవహర్ బాబుపై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండిరచారు. దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం కడప పర్యటనకు వెళ్లనున్న పవన్..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్నారు.