కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని విమర్శించారు. భూ సేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని, ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఐదు పేజీల ఈ లేఖలో జగన్ సర్కారుపై పలు ఆరోపణలు గుప్పించారు.
పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు ప్రభుత్వం రూ.32,141 కోట్ల నిధులను విడుదల చేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్ మాల్ జరిగింది. నిధులు పక్కదారి పట్టాయి. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో 21.87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారు. ఈ మొత్తం పథకంలో ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసింది. పీఎంఏవై (అర్బన్, రూరల్), జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు. ఈ పథకంలో జరిగిన అక్రమాలను గమనించి ఈ పథకం అమలు తీరుపై సీబీఐతోపాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న అవినీతి బయటపడే అవకాశం ఉంది. వేల కోట్లు ప్రజా ధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలోనే భారీ అవినీతికి తెరతీశారని మండిపడ్డారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించలేదని చెప్పారు. మొత్తంగా 6.68 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తవగా.. అందులో కేవలం 86,984 మందికి మాత్రమే అందించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.