- 10 లక్షల ఎకరాలకు పత్రాలు జారీ
- వేల కోట్లు దోచిన జవహర్ బినామీలు
- సీఎస్ అత్యంత అవినీతిపరుడు
- సహకరించిన విశాఖ కలెక్టర్
విశాఖపట్నం : పేదలకు ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే ముసుగులో భారీ కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటరు పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో 50 ఏళ్ల కిందటి నుంచి ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేశారని తెలిపారు. దీనివెనుక పెద్ద పన్నాగం దాగి ఉందని తెలిపారు. టీడీపీ ఉత్తరాంధ్ర నేత బైరెడ్డి పోతనరెడ్డితో కలిసి ఆదివారం మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూములపై సంబంధిత రైతులకు పూర్తి హక్కులు దక్కేందుకు గత ఏడాది ప్రభుత్వం జీవో 596 జారీచేసిందని తెలిపారు. దీనిని అడ్డు పెట్టుకుని భూముల కొనుగోలుకు బడాబాబులు ప్రధానంగా వైసీపీ నేత లు, వారి అనుకూల రియల్టర్లు, పలువురు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారని చెప్పారు. ఈ వ్యవహారంలో రూ.వేలకోట్ల ఒప్పందాలు జరగడంతో పాటు పలుకుబడి ఉపయోగించి రైతులపై ఒత్తిళ్లు తెచ్చారన్నారు. అసైన్డ్ భూములకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల జారీలో వివాదాలపై రిటైర్డు ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ గవర్నర్‌కు లేఖ రాశారని తెలిపారు. పేదలు, దళితులకు చెందిన భూములను అడ్డగోలుగా దోచుకుంటున్నారని మరో రిటైర్డు అధికారి పీవీ రమేశ్ సైతం ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఇంత జరుగుతున్నా విశాఖ, విజయనగరం జిల్లాల్లో అసైన్డ్ భూముల కొనుగోలు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి వెనక్కి తగ్గడంలేదన్నారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ఉన్నతాధికారిగా జవహర్‌రెడ్డి నిలిచారని విమర్శించారు. రైతులకు కస్టోడియన్లగా వ్యవహరించాల్సిన విశాఖ కలెక్టర్ మల్లికార్జున.. జవహర్‌రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు అధికారులూ కడప జిల్లాకు చెందిన వారు కావడంతో విశాఖలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు.
విచారణ కోరతాం
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల జారీపై సిటింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ కోరుతామని మూర్తియాదవ్ తెలిపారు. భీమిలి మండలం అన్నవరంలో భూములపై ఏడు కేసులు కోర్టులో ఉండగా రెండు కేసులు మాత్రమే ఉన్నాయని కలెక్టర్ చెప్పడాన్ని తప్పుబట్టారు. వైసీపీ నేతలు, సీఎస్ బినామీలకు అనుకూలంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. కలెక్టర్ చెప్పినట్టుగా జిల్లాలో ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసిన 700 ఎకరాలను సీఎస్, ఆయన బినామీలు, వైసీపీ నేతలే దోచుకున్నారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు.
వందల ఎకరాల కొనుగోలు
‘ఫ్రీహోల్డ్’ ముసుగులో విశాఖ పరిసరాల్లో జవహర్‌రెడ్డి, ఆయన బినామీ త్రిలోక్, సుభాశ్‌లు వందల ఎకరాలు కొనుగోలు చేశారని మూర్తి యాదవ్ తెలిపారు. ఈ వ్యవహారంలో కలెక్టర్, ఇతర అధికారులు సహకరించారని చెప్పారు. భూములు ఇవ్వని రైతులను బెదిరించి, బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. ఆనందపురం మండలం గండిగుండంలో సర్వేనంబరు 288/1లో కనకాల చిన్న, కనకాల అప్పారావులకు చెందిన 1.20 ఎకరాల భూములు రాయించుకున్నారని తెలిపారు. ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేయాలంటే రైతుకు చెందిన భూమిలో సగం జవహర్‌రెడ్డి బినామీలైన త్రిలోక్, సుభాశ్‌ల పేరిట రిజిస్ట్రేషన్ చేసేలా బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున వచ్చిన తర్వాత దసపల్లా భూములు, ఇతర భూములు ప్రైవేటు వ్యక్తుల పరమయ్యాయని ఆరోపించారు. ఎంతో మంది కలెక్టర్లు తిరస్కరించిన దసపల్లా భూములను మల్లికార్జున ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేశారని యాదవ్ తెలిపారు.