అమరావతి : పోలీసు ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్లకు సడలించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఏటా పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు, మూడున్నరేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్న యువతకు ఈ నోటిఫికేషన్ వేదన కలిగిస్తోందని అన్నారు. వయోపరిమితి నిబంధన వలన ఎంతోమంది అనర్హులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం పోలీస్ శాఖ ఉద్యోగాలకు 5 సంవత్సరాల గరిష్ట వయో పరిమితి సడలింపును ఇచ్చిన విషయం పరిగణనలోకి తీసుకుని ఏపీలో కూడా వయోపరిమితి సడలింపు ఇవ్వాలని కోరారు.