- వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- చివరి వ్యక్తివరకు ఆహారం అందించేందుకు కృషి
- సురక్షిత తాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి
- అంటువ్యాధుల ప్రబలకుండా తగు జాగ్రత్తలు..
- పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత ప్రాధాన్యతాంశం
- బాధితుల సాయానికి స్ఫూర్తితో ముందుకురండి
- నష్టాలను కేంద్రానికి నివేదించి.. సాయం కోరతాం
- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్యరథం): వరద బాధితులు అధైర్యపడొద్దని, అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మూడోరోజూ భరోసానిచ్చారు. తొలుత విజయవాడలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. నాలుగున్నర గంటలపాటు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. అధైర్యపడొద్దు.. మీ చెంతే నేనున్నా.. అంటూ భరోసా కల్పిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో డ్రోన్లను విజయవంతంగా ఉపయోగించుకోగలిగామన్నారు. మంగళవారం 25 డ్రోన్లను ఉపయోగించామని, రేపు అదనంగా మరో 30, 40 డ్రోన్లు తీసుకుంటున్నట్టు చెప్పారు. హెలికాప్టర్లు కూడా సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నాయని, బుధవారంనుంచి వైద్య శిబిరాలు ఎక్కడికక్కడ పెట్టడం జరుగుతుందన్నారు. వరద పరిస్థితిపై వివరాలు అందిస్తూ.. ‘మంచినీటిపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా బాటిల్స్ తీసుకొచ్చి పెద్దఎత్తున అందిస్తాం. అదేవిధంగా బుధవారం 180 ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లను అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు సాయంత్రానికి అన్ని వాటర్ స్కీమ్స్ సిద్ధవవుతాయి. అయితే ఆ నీరు వెంటనే తాగడానికి పనికిరావు. రెండు మూడు రోజులు పడుతుంది. ఈలోగా ఆ నీటిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై మార్గదర్శకాలిస్తాం. అదేవిధంగా విద్యుత్ స్టేషన్లను ఎన్ని వీలైతే అన్ని సిద్ధంచేసి బుధవారం లేదా గురువారంలోగా చివరి వరకు విద్యుత్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యుత్ స్టేషన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నీళ్లుఉంటే షాక్‌కొట్టే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ప్రమాద నివారణ చర్యలు పూర్తిచేసి విద్యుత్ పునరుద్ధరించేందుకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఫైర్ ఇంజిన్లను పెద్దఎత్తున తెప్పించి.. ప్రతి ఇంటినీ శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకుంటాం. వరద నీరు బయటకు పోయినచోట పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తాం. డ్రెయిన్లలో ఎక్కడైనా అడ్డంకులుంటే తొలగించి.. వరదనీరు సాఫీగా పోవడానికి చర్యలు తీసుకుంటాం. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో డ్రోన్లను ఉపయోగించే ఆలోచన చేస్తున్నాం. చెత్తాచెదారాన్ని పూర్తిగా శుభ్రం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా డెడ్ బాడీలుంటే వాటికి పోస్టుమార్టం నిర్వహించి సంబంధిత కుటుంబాలకు అప్పగించే బాధ్యత తీసుకుంటాం. సరైన పారిశుద్ధ్యం లేకుంటే అంటురోగాలు ప్రబలే ప్రమాదముంది. అందుకే అప్రమత్తతో వ్యవహరిస్తూ సరైన కార్యాచరణతో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
‘ఈరోజు నేను దాదాపు 25 కి.మీ.మేర వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగాను. ప్రజల కష్టాలను స్వయంగా చూశాను. అంబాపురంలో ఒకరు మాకు ఆహార ప్యాకెట్లు వచ్చాయి. పిల్లలకు నిన్నటినుంచి మంచినీరు లేదని, పంపించాలని అడిగారు. అలాంటి పరిస్థితి చూసినపుడు బాధేస్తోంది. చివరి మైలువరకూ బాధితులకు ఆహారం అందేలా కృషిచేయాలని ఆదేశాలిచ్చాం. ఎక్కడెక్కడ అయితే తమకు ఆహారం అందలేదనే ఫిర్యాదులు వచ్చాయో వాటి సమాచారాన్ని అధికారులకు ఇచ్చాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయా చోట్లకు ఆహారం అందించేలా ఆదేశించాను. ఏ సచివాలయాల పరిధిలో అయితే అవసరం మేరకు సిబ్బంది లేరో అక్కడ రెగ్యులర్ పేమెంట్ ఇచ్చి సహాయకులను నియమించుకోవాలి. ఏ ఒక్కరినీ వదలకుండా ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అందించాలని ఆదేశాలిచ్చాం. అక్కడక్కడ ఆహార ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు విసిరేస్తున్నారు. అవి నీటిలో పడుతున్నాయి. ఇది సరైంది కాదు. గౌరవప్రదంగా చేతికందించే బాధ్యత తీసుకోవాలి. ఈరోజు చాలావరకు ట్రాన్స్‌పోర్టుపరంగా ట్రాక్టర్లు ఉపయోగపడ్డాయి. బుధవారం ఎన్ని ట్రాక్టర్లు కావాలో, ఎన్ని చిన్న వాహనాలు కావాలో అన్నీ పెడతాం. ప్రతి వాహనం పోలీస్ ఎస్కార్ట్‌తో నేరుగా సచివాలయానికే వెళుతుంది. నేరుగా ప్రజల వద్దకే వచ్చి ఆహారాన్ని అందిస్తాం. ఈ విషయంలో ప్రజలు సహకరించాలి. ప్రతి వార్డులో వెయ్యి కుటుంబాలకు ఒకరిని పెట్టి వారికి సెల్‌ఫోన్ ఇస్తాం. ఎప్పటికప్పుడు వారు ఏదైనా మెసేజ్ పంపాలంటే పంపించే ఏర్పాట్లు చేస్తాం. సచివాలయానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తాం’ అని సీఎం చంద్రబాబు ఏర్పాట్లను వివరించారు.
‘ఆరోగ్యాన్ని కాపాడ్డానికి ఏమిచేస్తే బాగుంటుంది.. ఏమిచేయకూడదు.. అనే దానిపై ప్రత్యేకంగా పాంప్లెట్ తెస్తాం. తద్వారా ప్రజా చైతన్యంతో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. టెక్నాలజీ ఉపయోగించి ఎన్యూమరేషన్‌కు కూడా సెల్‌ఫోన్లను, డ్రోన్లను వాడమంటున్నాం. రాష్టం మొత్తంమీద ఎక్కడెక్కడ పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా డేటా తీసుకోవాలని ఆదేశించాం. అదేవిధంగా ఇళ్లల్లో, స్కూటర్లలోకి, మోటారు బైకుల్లోకి, కార్లలోకి నీరు వచ్చి దెబ్బతింటే వాటినన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత ఫైర్ సర్వీసెస్‌కు అప్పగిస్తాం. అవసరమైతై రిపేర్ల విషయం కూడా ఆలోచిస్తాం. రేపో ఎల్లుండో బ్యాంకులు, బీమా సంస్థలతోనూ మీటింగ్ పెడతాం. ఆటోలు, కార్లు వంటివాటికి బీమా ఇప్పించాల్సిన అవసరముంది. ఆ బీమా మొత్తం ఇప్పించడానికి ఏమి చేయాలో చేసి.. క్లెయిమ్‌లు ఇప్పించడానికి సర్టిఫికెట్లు అందిస్తాం. అదేవిధంగా కొందరి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చిన్నిచిన్న షాపులు పోయాయి. మూడు రోజులుగా ఎవరికీ ఏ పనీ లేకుండా ఇబ్బందిపడుతున్నారు. వీటన్నింటినీ విశ్లేషించి ఏవిధంగా వీరికి సహాయం చేయగలగుతామనే విషయంపైనా ఆలోచిస్తున్నాం. ప్రతి కుటుంబంలోనూ ప్రతివ్యక్తీ నష్టపోయారు. ఈవిధంగా నష్టపోయిన దానికి ఏం చేయాలో అన్నీ చేస్తాం. రిలీఫ్ ఇవ్వడానికి కొత్త మార్గదర్శకాలను ఖరారు చేస్తాం. మొత్తం సహాయ కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే ఇక్కడున్న అధికార యంత్రాంగమంతా తదుపరి కార్యాచరణకు వెళతాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వరద నీటి నిర్వహణ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి
‘అందరి ఆలోచనలను తీసుకొని సమర్థంగా పనిచేసేందుకు సిద్దమవుతాం. బుడమేరు నుంచి నీరు నేరుగా సింగ్‌నగర్‌కు రాకుండా కొల్లేరు లేదంటే వీటీపీఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేలా అక్కడున్న అడ్డంకులను త్వరలోనే నివారిస్తాం. కృష్ణలంకలో ఉన్న గోడకు సంబంధించి లక్ష్యం పెట్టుకుంటాం. గోడకు లోపల ఉన్న నీటిని వీలైనంత త్వరగా లిఫ్ట్ చేస్తాం. ఇలా ప్రతి విషయాన్నీ విశ్లేషించుకొని ప్రతి పనినీ పూర్తిచేస్తాం. డ్రెయిన్ వ్యవస్థను పటిష్టం చేసేలా చూస్తాం. మున్ముందు ఈ నగరానికి ఇలాంటి పరిస్థితి రాకుండా చాలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తాం. వరద నీటి మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో ఓ ప్రాజెక్టు చేశాం. గత ప్రభుత్వం దీన్ని ఆపేసింది. మళ్లీ దీన్ని పునరుద్ధరిస్తాం. కృష్ణా నదిలో వరద బాగా తగ్గింది. నిన్న ఈ సమయానికి చూస్తే 11.43 లక్షల క్యూసెక్కులు ఉండగా ఈ రోజు 6.65 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. రేపటికి ఇంకా తగ్గే అవకాశముంది. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి.. సహాయాన్ని కోరతాం’ అని చంద్రబాబు వివరించారు.
‘వరదల కారణంగా చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉన్న వారికి ఇబ్బంది కలిగింది. ఇంట్లోని వస్తువులు దెబ్బతిన్నాయి. ఎన్యూమరేషన్ చేస్తే వివరాలు వస్తాయి. పశువుల మేతపైనా దృష్టిసారిస్తాం. వరదల్లో ఓ లైన్‌మ్యాన్ కరెంట్ షాక్‌తో చనిపోయారు. ఆయనకు డిపార్టుమెంట్ తరఫున రూ. 20 లక్షలు, ప్రభుత్వం తరఫున మరో రూ. 10 లక్షలు మొత్తం రూ.30 లక్షలు అందించి న్యాయం చేస్తాం’ అని సీఎం వివరించారు.
‘ఈ రోజు వరద బాధితులకు సహాయం అందించేందుకు చాలామంది ముందుకొచ్చారు. కొందరు రూ.కోటి, మరికొందరు రూ.50 లక్షలు, కొందరు రూ.20 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది ముందుకురావాలని కోరుతున్నాం. ఇలా ముందుకొచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. విజయవాడలో ఉన్నవారిలో కూడా స్ఫూర్తి రావాలి. మానవతా దృక్పథంతో అందరూ ముందుకొచ్చి ఆదుకోండి.. విరాళాలు అందించేందుకు డిజిటల్ ప్లాట్‌పామ్స్, క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసి వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు, సోషల్ మీడియాకు ఇస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు.
బాధితులు అందరికీ న్యాయం చేస్తామన్నారు. వరద ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను లోతుగా తెలుసుకునేందుకు ప్రొక్లెయిన్‌లో వెళ్లానని, హలికాప్టర్‌లో వెళ్లొచ్చుకానీ.. హెలికాప్టర్‌లో అయితే పైనుంచి చూడ్డమే అవుతుంది. కింద పరిస్థితులను లోతుగా పరిశీలనకు వీలుకాదన్నారు. అందుకే ఎవరూ వెళ్లడానికి వీల్లేని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లాను. రేపు, ఎల్లుండులోగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు అన్ని విధాలా కృషిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించడం పట్ల చంద్రబాబు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.