- 16 నుంచి క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులు
- ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటాం
- రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
- మంత్రి గొట్టిపాటితో కలిసి ఆలయాల సందర్శన
తిరుమల/తిరుపతి(చైతన్యరథం): రైతులు, ప్రజల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ నెల 15న రెవెన్యూ లాంఛనంగా సదస్సులు ప్రారంభించనున్నామని, ఈ నెల 16 నుంచి సెప్టెంబరు 30 వరకు 45 రోజులు క్షేత్రస్థాయిలో సదస్సులు నిర్వహిస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక పేరూరు వకుళమాతను విద్యుత్ మంత్రి గొట్టిపా టి రవికుమార్‌తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. తర్వాత అనగాని మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి, వకుళమాత అమ్మవారి కృప రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని కోరుకున్నట్టు తెలిపా రు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి రెవెన్యూ, భూ సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు.
గ్రామాలలో ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి భయప డుతున్నారని, ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ పెట్టి వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. వందల సంవత్సరాలుగా అన్యాక్రాంతమైన అసైన్‌మెంట్ ల్యాండ్స్‌ను పరిశీలించి వాటికి పరిష్కారం చూపే దిశగా ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, తిరిగి రియల్ టైమ్ గవర్నెన్స్, కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా కార్యాచరణ చేయనున్నట్టు తెలిపారు.
నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తాం
విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చామని, ప్రజలు నచ్చే.. మెచ్చే విధంగా పరిపాలనను కొనసాగిస్తామని, గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకెళతామని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కడా కూడా రాష్ట్రంలో జరగలేదని, విద్యుత్ చార్జీలను పరిశీలిస్తే ఏడు ఎనిమిది సార్లు పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపారన్నారు. రైతులకు మెరుగైన విద్యుత్ సౌకర్యం, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తూ వినియోగానికి తగ్గ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని రైతు లు నష్టపోయే విధంగా ఏ విధమైన నిర్ణయం తీసుకోబోమని తెలిపారు.