- ఎన్‌హెచ్‌ఎం కింద ఏపీకి ప్రత్యేకంగా రూ.1000 కోట్లు ఇవ్వాలి
- ఖాళీ ఖజానా ఇచ్చారు కాబట్టే అప్పులు
- గత ప్రభుత్వ విధ్వంసాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెడతాం
ఢిల్లీ: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖమంత్రి సత్యకుమార్ తెలిపారు. మంత్రి సత్యకుమార్ బుధవారం ఢల్లీిలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. అనంతరం సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామని అన్నారు. నెల రోజుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు అడిగి తెలుసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అర్థిక భారం ఉన్నప్పటికీ సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, అన్న క్యాంటీన్లు, స్కిల్ సెన్సస్ తదితర కార్యక్రమాలపై కేంద్ర మంత్రులకు వివరించానని సత్యకుమార్ తెలిపారు.
వైసీపీ అరాచక పాలన కారణంగా ఏపీ అన్ని రకాలుగా వెనుకబడిరదన్నారు. తాము సంపద సృష్టిస్తున్నామని.. అందుకే అమరావతి చుట్టూ రహదారుల నిర్మాణం వేగంగా చేపడుతున్నామని వివరించారు. సంపద సృష్టికి కొంత సమయం పడుతుందన్నారు. ఖాళీ ఖజానా అప్పగించారు కాబట్టే తప్పని పరిస్థితుల్లో పింఛన్లు, జీతాల కోసం కొంత మేర అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల్లుగా రాష్ట్రంలో ఆరోగ్య విభాగాన్ని భ్రష్టుపట్టించిన విధానాన్ని కూడా వివరించానని చెప్పారు. నిధులు ఇవ్వకుండా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టటంతో అవి అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పడ్డ నేపథ్యంలో ఆ ప్రకారం ఎన్‌హెచ్‌ఎం నిధులు మంజూరు చేయాలి. గ్రామీణ ఆరోగ్య మందిర్‌ల నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. ఆరోగ్య మందిర్లలో సిబ్బందికి జీతాలు చెల్లించడం కోసం రూ. 1,000 కోట్లు అందించాలని కేంద్రాన్ని కోరినట్లు సత్యకుమార్ తెలిపారు.
విశాఖ మెట్రోపై వైసీపీ దొంగమాటలు
వైసీపీ అరాచక పాలన కారణంగా ఏపీ అన్ని రకాలుగా వెనుకబడిరది. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు ఢల్లీి వచ్చిన ప్రతిసారీ రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకుని వెళ్తున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు సామాన్య విషయం కాదు. బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖ మెట్రో రైల్ ఇలా చాలా విభజన హామీలను సాధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయేవి. విశాఖపట్నం మెట్రో విషయంలో డీపీఆర్ సవరించి పంపించమంటే గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు దానిపై దొంగ మాటలు చెబుతున్నారన్నారు. విశాఖను పాలనా రాజధాని అన్నారు తప్ప చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాజకీయ వివక్ష లేకుండా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత్తలు తీసుకోలేదు
స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం సీజనల్ వ్యాధుల గురించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత్తల విషయంలో గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఏప్రిల్ నెల నుంచే ఈ ఏర్పాట్లు చేయాలి. మేం అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక ఉదాసీనత లేకుండా పనిచేస్తున్నాం. రాజకీయాల్లో విమర్శలు అవసరమే. అయితే అవి నిర్మాణాత్మకంగా ఉండాలి. గతంలో విమర్శలు చేస్తే ఎలా కేసులు పెట్టారు? ఎలా వేధించారు? మీ అరాచకాల కారణంగానే ప్రజలు ఇలాంటి తీర్పునిచ్చారు. ప్రజాతీర్పుపై ఆత్మవిమర్శ చేసుకోకుండా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. అధికారం కోల్పోయి నెల కూడా కాకముందే వైసీపీ నేతలు కుట్రపూరితంగా విమర్శలు చేస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు.
అనారోగ్యశాఖగా మార్చారు
ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేలా ఐదేళ్లలో విధ్వంసం జరిగింది. అధ్యయనం చేయకుండా అడ్డగోలుగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వాటికి నిధులు ఇవ్వలేదు. చాలావాటికి కేంద్రం వివిధ స్కీముల ద్వారా, నాబార్డ్ ద్వారా నిధులు అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సింది ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా పునాదులు వేసి వదిలేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మాత్రమే పూర్తయింది. హాస్టల్ పూర్తికాలేదు. రూ. 9 వేల కోట్లు ఉంటే తప్ప మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి కావు. వీటిని కట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. కొత్త మెడికల్ కాలేజీల్లో ఉన్న లోటుపాట్ల కారణంగా ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వలేదు. ప్రైవేట్ భాగస్వామ్యం లేదా పీపీపీ మోడల్.. ఇలా చాలా రకాల ఆప్షన్ల ద్వారా కొత్త మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వ్యవస్థల్లో చాలా రకాలుగా విధ్వంసం చేశారని మంత్రి సత్యకుమార్ దుయ్యబట్టారు.
దార్శనిక నాయకత్వం ఉంది
ప్రస్తుతం రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకత్వం ఉంది. గతంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్ది గాడిలో పెట్టగలం అని నమ్ముతున్నాం. మెడికల్ ఇన్సూరెన్స్‌ను హైబ్రీడ్ మోడల్లో ప్రజలకు రూ. 25 లక్షల మేర లబ్ధి పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ, మెడికల్ ఇన్సూరెన్సులను కలిపి పనిచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. కేన్సర్‌కి సంబంధించి మరికొన్ని కేంద్రాలు మంజూరు చేయాలని కోరాను. ప్రజలందరికీ కేన్సర్ స్క్రీనింగ్ జరపడం కోసం ఉద్దేశించిన ఫైల్‌పై మొదటి సంతకం చేశా. కేన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రభుత్వంపై చికిత్ప భారం కూడా తగ్గుతుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.