- వరద ప్రభావిత ప్రాంతాల్లో 11 నుండి దోమల లార్వాల నిర్మూలనా కార్యక్రమం
- వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య,ఆరోగ్యశాఖ పెద్ద యజ్ఞాన్నే చేపట్టింది
- 190 ఉచిత వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశాం
- వెయ్యికి పైగా సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు
- లక్ష మందికి పైగా మెడికల్ క్యాంపుల్లో వైద్య సేవల్ని పొందారు
- ఇంటింటికీ అత్యవసర మెడికల్ కిట్లు అందజేశాం
- ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతోనే నిర్విరామంగా పనిచేస్తున్నాం
- వైద్య సిబ్బంది శిక్షణా కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్
విజయవాడ(చైతన్యరథం): వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సైనికుల్లా పనిచేయాలని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. 190 ఉచిత వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశామని, లక్ష మందికి పైగా బాధితులు ఈ శిబిరాల్ని సందర్శించారన్నారు. వెయ్యి మందికి పైగా వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారన్నారు. సోమవారం నాడు తుమ్మలపల్లి కళా క్షేత్రంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు, సబ్ యూనిట్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో మంత్రి మాట్లాడారు. వారం రోజులకు పైగా నీట మునిగిన ప్రాంతాల్లో దోమల లార్వాలు పెరిగి మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ఆరోగ్య శాఖ శిబ్బంది లార్వాల నిర్మూలనా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 11 నుండి దోమల లార్వాల నిర్మూలనా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఎన్టీఆర్, కాకినాడ, పల్నాడు జిల్లాల నుండి వైద్య సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల లార్వాల నిర్మూలనా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.
వారం రోజుల పాటు అంకిత భావంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వరద పీడిత ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు ఇంటింటి సర్వే చేసేందుకు ఇప్పటికే 150 బృందాలు రంగంలోకి దిగాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ పెద్ద యజ్ఞాన్నే చేపట్టిందన్నారు. వరదలు ప్రారంభమైనాటి నుండి వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారని, ఆ స్ఫూర్తితోనే మంత్రులుగా తాము కూడా నిరంతరమూ పనిచేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు రేయింబవళ్లూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వార్ రూంలోనే ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్షిస్తున్నారన్నారు. వార్డుకో ఐఎఎస్ ఆఫీసర్‌ను నియమించడంతో పాటు మంత్రులు కూడా నిరంతరమూ పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారన్నారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చేలా పనిచేస్తోందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల్లో దాదాపు 5003 మంది జ్వరాలకు చికిత్స పొందారన్నారు. నీటి నిల్వలుండం వల్ల దోమల లార్వాలు పెరిగే అవకాశముందని, లార్వాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టామన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో దోమల లార్వాలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్ని చేపట్టమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కలెక్టరేట్లో ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఉద్యోగులుగా మనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూ బాధితులకు వైద్య సేవలందించాలన్నారు. దోమల లార్వాల నివారణా కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుని అన్ని ప్రాంతాల్నీ కవర్ చేయాలన్నారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ వార్డు సచివాలయాన్ని యూనిట్ గా తీసుకుని యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టామన్నారు. వరద ప్రభావిత 32 డివిజన్లలో 150 వార్డు సచివాలయాలున్నాయని, వీటిలో నీరు పూర్తిగా లేని 88 వార్డు సచివాలయాల్లో శిక్ణణ పొందిన 330 మంది సిబ్బంది దోమల లార్వాల నిర్మూలనా కార్యక్రమంలో ఈనెల 11 నుండి పాల్గొంటారన్నారు. నీరు పూర్తిగా వెళ్లిపోయాక మిగతా వార్డు సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సహకారంతో యాంటీ లార్వా ఆపరేషన్ పకడ్బందీగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసిందన్నారు. వార్డు సచివాలయాల్లో స్టాక్ పాయింట్లు పెట్టామనీ, రోజుకు 100 ఇళ్లు చొప్పున తీసుకుని వారం రోజుల్లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
వార్డు సచివాలయానికి ముగ్గురు చొప్పున ఎంపిహెచ్‌ఎలు పనిచేస్తారని, మూడు నాలుగు వార్డు సచివాలయాలకు ఒక మల్టీ పర్పస్ హెల్త్ సూపర్ వైజర్ బాధ్యత వహిస్తారన్నారు. వీరందరినీ సబ్ యూనిట్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారని, మరో నలుగురు అడిషన్ డైరెక్టర్లను కూడా పర్యవేక్షణ కోసం నియమించామని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలు ఈ నెల 15 వరకు పనిచేస్తాయన్నారు. విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ టి.రమేష్ కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.