- పెద్దఎత్తున హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు
- గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ లాంఛనంగా ప్రారంభించిన సీఎం
- ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్ విధానానికి శ్రీకారం
- విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించిన సీఎం
నైతిక విలువలు, పరిసరాల పరిశుభ్రత, ఆత్మరక్షణపై ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
పాలకొండ (చైతన్య రథం): పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని ఆదర్శ పాఠశాల, జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్(మెగా పీటీఎం 3.0) ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు పెద్దఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ముందుగా భామిని ఆదర్శ పాఠశాల ఆవరణానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్(పౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సీఎం, మంత్రి లోకేష్ ఇంటరాక్ట్ అయ్యారు. గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ యాప్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంత్రి లోకేష్ వివరించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, ప్రోగ్రెస్ రిపోర్ట్ లను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. అనంతరం జాదూ పిఠార్, గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ మెటీరియల్ ను పరిశీలించారు.
పాఠశాలలో స్పోర్ట్స్ రూమ్, స్కిల్ అండ్ లెర్నింగ్, స్టెమ్ ల్యాబ్ సందర్శన
పాఠశాలలో స్పోర్ట్స్ రూమ్, స్కిల్ అండ్ లెర్నింగ్ ల్యాబ్, స్టెమ్ ల్యాబ్ ను మంత్రి లోకేష్ తో కలిసి చంద్రబాబునాయుడు పరిశీలించారు. వివిధ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలు, ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు.
విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి
ల్యాబ్‌లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ పాఠశాలలోని తొమ్మిదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్ లు, హాజరు శాతంను పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల పనితీరు, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యసన ఫలితాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి వాకబు చేశారు. తల్లిదండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.
ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్ విధానానికి శ్రీకారం
భామిని ఆదర్శ పాఠశాల వేదికగా ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్ విధానానికి మంత్రి నారా లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. తరగతి గదిలో వీడియో ప్రదర్శించి క్లిక్కర్ విధానం ద్వారా స్టూడెంట్ అసెస్ మెంట్ చేశారు. క్లిక్కర్ విధానంలో 2,300 వీడియోలు రూపొందించినట్లు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబునాయుడుకు వివరించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి ఫోటోలు దిగారు.
ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ను పురస్కరించుకుని సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జి.బాబురావు పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం 6వ తరగతి విద్యార్థి కేదార్ సాయి నైతిక విలువలను పద్యాల రూపంలో చెప్పడం ఆకట్టుకుంది. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాల్య వివాహాలపై ఇంటర్ సెకండియర్ విద్యార్థిని సీహెచ్ శోభారాణి ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం బాలికల ఆత్మరక్షణను వివరిస్తూ 6 నుంచి 12వ తరగతి విద్యార్థినులు బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను పదర్శించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ భోజనం చేశారు.
కార్యక్రమంలో విద్యాశాఖ రాష్ట్ర కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, భామిని ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.బాబూరావు, పాఠశాల ఎస్‌ఎంసి ఛైర్మన్ వానపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.












