- వరద సాయం కింద రూ. కోటి విరాళం అందజేత
- ముఖ్యమంత్రి సాదర స్వాగతం
- కారు వరకూ వెళ్లి వీడ్కోలు
- మానవతా సాయంలో ముందుంటారని ప్రశంసలు
హైదరాబాద్ (చైతన్యరథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఏపీలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, తన తనయుడు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. రూ.కోటి విరాళం అందించిన చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌లకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు నాయుడు…..భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు.
తరువాత దీనిపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. చిరంజీవి తనను కలిసిన ఫొటోలను చంద్రబాబు షేర్ చేస్తూ… మానవతాసేవలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. విపత్తు సమయాల్లో తప్పకుండా తన మద్దతు అందిస్తుంటారు. వరదల వల్ల నష్టపోయిన బాధితుల జీవితాలను పునర్నిర్మించేందుకు చిరంజీవి, రామ్ చరణ్ అందించిన సహకారం ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
కాగా సీఎం చంద్రబాబు చేసిన పోస్ట్‌పై మెగాస్టార్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. నాపై మీరు చూపిన అభిమానానికి ధన్యవాదాలు… వరదలు వంటి భారీ విపత్తు సంభవించినప్పుడు మన సొంతవారికి సహాయం చేయడం మా కర్తవ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మీ నాయకత్వం ఎంతో ఆదర్శనీయం.. అని ట్వీట్ చేశారు.