టిడిపి అధికారంలోకి వచ్చాక మోటార్లకు మీటర్లు రద్దుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం చెన్నూరు క్రాస్ వద్ద కమలాపురం నియోజకవర్గ రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మా నియోజకవర్గంలో 14,452 వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా ఒక్కో రైతునుంచి రూ.35వేలు వసూలు చేసేందుకు ప్లాన్ వేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.88వేల కోట్లు రైతులపై భారంపడే అవకాశం ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మోటార్లకు మీటర్లు లేకుండా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా జగన్ రైతుల మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు. వైసిపి అధికారంలోకి వచ్చాక గతంలో టిడిపి ప్రభుత్వం అమలుచేసిన రైతు సంక్షేమ పథకాలన్నీ జగన్ రద్దుచేశారు. ఇప్పటికే జగన్ అనాలోచిత విధానాల కారణంగా రాష్ట్రరైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రైతులకు అన్నదాత పథకం కింద ఏటా రూ.20వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.