అమరావతి (చైతన్య రథం): పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పని చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా దేవరాజుగట్టులో టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబుతో కలిసి వర్షాలను లెక్కచేయకుండా మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డోలా మాట్లాడుతూ… సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో అవ్వతాతలు, వికలాంగులు ఇబ్బంది పడకూడదనే రోజు ముందుగానే పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పించను 4 వేలు పెంచాం. రూ.3 వేలు పించను ఇస్తానని జగన్ వృద్ధుల్ని మోసం చేశారు. రూ. వెయ్యి పెంచడానికి జగన్‌కి ఐదేళ్ళు పట్టింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెన్షన్‌ని రూ.4,000కు పెంచడం, మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం రూ.7,000 పెన్షన్ జులై మాసంలోనే ఎన్డీయే కూటమి ఇచ్చిందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి చెప్పారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అమలుచేస్తూ ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో మొత్తం 2 లక్షల 91 వేల 534 మందికి ఈ రోజు 199 కోట్ల రూపాయలు పింఛన్ కింద ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. యర్రగొండపాలెం నియోజక వర్గంలో 36,581 మందికి 25 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అదీ.. జగన్ మోసం
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసి జగన్ జిల్లా ప్రజలను మోసం చేశారన్నారు. చేసిన మోసానికి జిల్లా ప్రజలు జగన్‌కి తగిన బుద్ధి చెప్పారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే, నీళ్లు ఇచ్చేది మేమేనన్నారు. వైసీపీ నేతలు దోచుకోవడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని, రాష్ట్రంలో త్వరలోనే సీసీ రోడ్లు ప్రారంభించి 5 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, మండలస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
వర్షాలపై సమీక్ష
భారీ వర్షాలు, వరదలపై అధికారులతో శనివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా సమీక్షించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ, కలెక్టర్, రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల, సంక్షేమ వసతి గృహాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ఇంటినుంచి బయటకు రావొద్దని జిల్లా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.