అద్దంకి (చైతన్యరథం): విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పెదనాన్న, మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు వర్ధంతి వేడుకలు అద్దంకి నియోజకవర్గంలో శనివారం ఘనంగా జరిగాయి. తొలుత యద్దనపూడి గ్రామానికి చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానికంగా ఉన్న పెదనాన్న హనుమంతరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అద్దంకి చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో గొట్టిపాటి హనుమంతరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింథైట్, ఎస్‌ఆర్‌ఆర్, అసిస్ట్ ఇండియా సంస్థల సహాయ సహకారాలతో సేకరించిన సుమారు 40 త్రిచక్ర స్కూటీలను దివ్యాంగులకు మంత్రి గొట్టిపాటి అందించారు. అనంతరం లబ్ధిదారులైన 17 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. దివ్యాంగులకు స్కూటీలు అందించడానికి ముందుకు వచ్చి, అద్దంకి నియోజకవర్గంలో ప్రజలకు సేవచేసే కార్యక్రమంలో భాగమైనందుకు దాతలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు.
అద్దంకి అభివృద్ధికి దాతలు ముందుకు రావడం శుభ పరిణామమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించారు. గతంలో కూడా సీఎస్‌ఆర్ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి గుర్తు చేశారు. నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందని మంత్రి గొట్టిపాటి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 9 కమిటీ హాళ్లు నిర్మించినట్లు మంత్రి వెల్లడిరచారు. వచ్చే ఏడాదికి మరో 10 కమ్యూనిటీ హాళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. దాతల సహకారంతో అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి మహిళా విద్యార్థికి ఉచితంగా సైకిళ్లను అందజేస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అద్దంకి నియోజకవర్గంలో వ్యాపారులెవరూ వ్యాపారం చేసే పరిస్థితులు లేవని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారులకు అండగా నిలుస్తోందని తెలిపారు. స్థానికంగా ఉండే యువతకు ఉపాధి కల్పించేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి మద్దతు
ఇచ్చి ప్రోత్సహిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.
కార్యక్రమం అనంతరం ప్రజావేదిక నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో కొంత మంది దీపం పథకం లబ్ధిదారులకు సబ్సిడీ అందడం లేదనే విషయాన్ని మంత్రి గొట్టిపాటి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. దీనిపై సచివాలయాల ఉద్యోగులతో చర్చించి ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు సబ్సిడీ అందేలా ఆదేశాలు జారీ చేశారు.