- వరుస ఘటనలపై సీఎండీలతో అత్యవసర సమీక్షా సమావేశం
- ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలి
అమరావతి(చైతన్యరథం): కడపలో విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి చెందడంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస విద్యుత్ ప్రమాదాలపై సీఎండీలతో మంత్రి సచివాలయంలో బుధవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. కడప ఘటనపై పూర్తి సమాచారాన్ని వివరించాలని మంత్రి కోరగా… స్పందించిన అధికారులు ఈ ఘటనకు స్థానిక కేబుల్ ఆపరేటర్ కారణం అని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ వైర్ లాగడానికి ప్రయత్నించిన తరుణంలో విద్యుత్ తీగ కిందపడినట్లు వివరించారు. కేబుల్ ఆపరేటర్ ముందస్తు సమాచారం అందించి ఉంటే ప్రమాదం తప్పేదన్నారు. అయితే తీగ తెగిపడిన సమయంలోనే దురదృష్టవశాత్తు పిల్లలు అదే దారి వెంబడి రావడంతో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
దీనిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి కోరారు. ముఖ్యంగా తీగలు వేలాడుతున్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి వాటికి మరమత్తులు చేయాలని చెప్పారు. కడప ఘటన బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి గొట్టిపాటి… ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం తనను కలిచి వేసిందని అన్నారు. ప్రమాదం జరిగాక పరిహారం ఇవ్వడం కంటే.. ఘటనలు జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.