- స్వస్థలానికి తీసుకొస్తానని హామీ
- మోసగించిన ఏజెంట్ ఎడారిలో ఒంటెల మధ్య పడేశాడని బాధితుడి ఆవేదన
- అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎక్స్‌లో వీడియో
- వెంటనే స్పందించిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ దుర్భర జీవితం గడుపుతున్న రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. నాలుగు డబ్బులు సంపాదించుకుందామనే ఆశతో కువైట్ వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయి ఎడారిలో చిక్కుకుపోయిన కడప జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తిని ఇటీవలే నారా లోకేష్ ఆదుకుని స్వస్థలానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ కోవలోనే తాజాగా సౌదీఅరేబియాలో అష్టకష్టాలు పడుతున్న వీరేంద్ర అనే వ్యక్తి వీడియో చూసి లోకేష్ స్పందించారు. నకిలీ ఏజెంట్ చేతిలో తాను మోసపోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్నానని వీరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశాడు. ఖతార్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి… తనను మోసం చేసి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో తాను బాధపడుతున్నానని, ఇక్కడ బతకలేకపోతున్నానని చెప్పాడు. వీరేంద్ర వీడియో చూసి నారా లోకేశ్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.