- సాక్షిపై పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్
- విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి హాజరు కానున్న మంత్రి
- ‘చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనంపై న్యాయపోరాటం
అమరావతి(చైతన్యరథం): సాక్షి పత్రికపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో గురువారం జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్‌కి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో అసత్యాలు, కల్పితాలతో ఓ కథనం ప్రచురించారు. అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను పరువుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఆ కథనం ప్రచురించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన న్యాయవాదుల ద్వారా రిజిస్టర్ నోటీసుని సాక్షికి పంపించారు. సాక్షి ఎటువంటి వివరణ వేయకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం ప్రచురించానరి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో తాను అసలు ఆ నరగంలోనే లేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే వీఐపీలకు అతిథి మర్యాదల కోసం చేసిన ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు. వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్‌తో మళ్లీ మొదలు అవుతోంది.