అమరావతి(చైతన్యరథం): ఆయన ఇంకా రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయంలో అడుగు పెట్టలేదు. అయినా మంత్రి నారా లోకేష్ తాను చేపట్టిన విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు ఈనెల 15వతేదీన ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే విద్యార్థులకు వైసిపి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిందని తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. పుస్తకాలు లేకుండా పేదవిద్యార్థులు ఎలా చదువుతారని ఆ సమావేశంలోనే అధికారులను ప్రశ్నించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తక్షణమే ఇంటర్ విద్యార్థ్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ తోపాటు బ్యాగులు కూడా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించడంతో అధికారులు ఆగమేగాలపై మంగళవారం జీవో ఎం.ఎస్. నెం.28ని విడుదల చేశారు. త్వరలోనే పుస్తకాలు పంపిణీ కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా లోకేష్ తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంగళగిరి ప్రజల కోసం తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు గత నాలుగురోజులుగా ఉండవల్లి నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.