- రైతుల నుండి అంగీకార పత్రాల స్వీకరణ
- ఇప్పుడు భూములిచ్చే రైతులకు కోరుకున్న చోట ప్లాట్స్ ఇస్తామని వెల్లడి
అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు ఆదివారం సాయంత్రం స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబాలెం గ్రామంలోని 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే వారికి రాజధానిలో ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతంలో కోరుకున్న చోట స్థలాలిస్తామని చెప్పారు. ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. భూములిచ్చిన మరుసటి రోజే రైతులకు ప్లాట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారన్నారు. భూములు ఇచ్చే రైతులు తమని సంప్రదిస్తే వారి ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామని తెలిపారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్స్ ఇచ్చామన్నారు. ప్రస్తుతం కొంత మేర భూమి మాత్రమే అవసరం ఉన్నందున ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమి ఉన్న చోట రైతులు కోరుకున్న ప్లాట్స్ ఇస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భారీ వర్షాలు వరదల కారణంగా రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు నిలిచిపోయాయి. తిరిగి ఈనెల 17 నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడతామని తెలిపారు.