తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని 2024లో ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. మంగళవారం రాజమండ్రి లోని 50వ డివిజన్ లో గల ఆర్ అండ్ బీ వాంబే గృహాల వద్ద రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ తాడి మరియ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలు అన్ని విధాలుగా పడరాని పాట్లు పడుతున్నారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారన్నారు. తాము ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళుతుంటే 2019 ఎన్నికల్లో తెలియక జగన్ పార్టీకి ఓట్లు వేసామని, ఇప్పుడు ఇదేం ఖర్మ అంటూ బాధపడుతున్నామని అంటున్నారని తెలిపారు.
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా, టీడీపీ హయాంలో తీసుకువచ్చిన పరిశ్రమలను తుగ్లక్ నిర్ణయాలతో వెల్లగొడుతున్నారని ఆరోపించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.