- రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
- సీటురాని వాళ్లు నిరుత్సాహపడొద్దు
- పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు
ఢిల్లీ: భాజపా, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో శనివారం ఢల్లీి నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చిలకలూరిపేటలో నిర్వహించే ఉమ్మడి సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని చెప్పారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవడానికి కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నాం. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి.. స్పష్టత వచ్చింది. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుంది. మా మధ్య ఎలాంటి గందరగోళం లేదు అని చంద్రబాబు తెలిపారు.
ఈనెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే మూడు పార్టీల ఉమ్మడి బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ప్రధాని షెడ్యూల్‌ను బట్టి అవసరమైతే సభ తేదీని ఒకటిరెండు రోజులు అటూఇటుగా మార్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. సీట్ల విషయంలో గందరగోళం లేదని, ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందో రెండ్రోజుల్లో వెల్లడిస్తామని చంద్రబాబు చెప్పారు. కాగా ఎన్డీయేలో టీడీపీ చేరిన తరువాత నిర్వహించే తొలిసభ కావటంతో పార్టీ నాయకులు, శ్రేణులు చిలకలూరిపేట సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు.