- రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నడ్డాసహా సీనియర్లకు చోటు
- కేబినెట్‌లోకి మాజీ సీఎంలు చౌహన్, మనోహర్‌లాల్, కుమారస్వామి
- తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడు, కిషన్‌రెడ్డి
- సహాయ మంత్రులుగా పెమ్మసాని, శ్రీనివాసవర్మ, బండి సంజయ్
- 81మంది మంత్రులకు తావుండగా 72మంది ప్రమాణ స్వీకారం
- 30మంది కేబినెట్ మంత్రుల్లో తొమ్మిది కొత్త ముఖాలు
- ఐదుగురు స్వయంప్రతిపత్తి కల్గిన సహాయ మంత్రులు
- మరో 36మంది సహాయ మంత్రులు
- ఎనిమిది మిత్రపక్షాలకు మంత్రిమండలిలో చోటు
- కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆదివారం సాయంత్రం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా 72 మందితో 18వ లోక్‌సభకు మంత్రివర్గం కుదురుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి ఇద్దరు తెలుగువాళ్లు సహా 30మందికి కేబినెట్‌లో చోటుదక్కితే, ఐదుగురు స్వతంత్ర, 36మంది సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా కొనసాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విదేశీ ప్రత్యేక ఆహ్వానితులు, ఎన్డీయే అతిరథ మహారధులు 8వేలమంది హాజరయ్యారు. పాత కొత్తల మేలు కలయికగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, ఆంధ్రప్రదేశ్ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి తదితరులు మోదీతోపాటు ప్రమాణం స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. అంగరంగ వైభవంగా సాగిన మోదీ సర్కార్ 3.0 ప్రమాణ స్వీకార పూర్తి కథనం 2వ పేజీలో….
న్యూఢిల్లీ: భారీ సంఖ్యలో మొత్తం 72 మంది మంత్రులతో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నాయకత్వంలో నూతన కేంద్ర ప్రభుత్వం కొలువు తీరంది. న్యూఢల్లీిలోని రాష్ట్రపతి భవన్ ముందున్న విశాల ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మోదీ, ఇతర మంత్రులచేత ఆదివారం నాడు ప్రమాణస్వీకారం చేయించారు. నియమాల ప్రకారం కేంద్ర మంత్రిమండలిలో 81 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంది. ప్రధాని మోదీ మనోగతాన్ని ఆవిష్కరిస్తూ భారీ స్థాయిలో మొత్తం 72 మంది మంత్రులు కొలువుదీరడం గమనార్హం. దీంతో విస్తరణకు పెద్ద వెసులుబాటు కనిపించడం లేదు. ప్రజల తీర్పు మేరకు బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వహించి వీలైనంత త్వరగా ఫలితాలను ప్రజలకు చూపాలి అన్న లక్ష్యంతో దాదాపు మొత్తం మంత్రిమండలి సభ్యులకు ఒకేరోజు ప్రధాని మోదీ బాధ్యతలు అప్పగించారని..ఇదొక విశేష పరిణామమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. శనివారంతో పదవీకాలం ముగిసిన మోదీ సర్కార్ 2.0లోని సీనియర్ మంత్రులదరికీ ప్రధాని మోదీ కొత్త కొలువులో స్థానం కల్పించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సర్కార్ 3.0లో కేబినెట్ మంత్రులుగా కొనసాగుతున్న సీనియర్లలో రాజనాథ్‌సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, డాక్టర్ ఎస్.జయశంకర్, జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్ జోషి, అరుణ్ వైష్టవ్, జి.కిషన్‌రెడ్డి ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఉన్న జెపి.సడ్డాను ప్రధాని మోదీ తన మంత్రిమండలిలోకి తీసుకున్నారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 30 మందిలో 25 మంది బిజేపీకి చెందిన వారు. కాగా మొత్తం 24 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది. మొత్తం మంత్రుల్లో ఓబీసి వర్గానికి చెందిన వారు 27 మంది, ఎస్‌సిలు 10 మంది, ఎస్టీలు ఆరుగురు, మైనార్టీలు ఐదుగురు ఉన్నారు.
ఎన్డీయే కూటమిలో ఐదు మిత్రపక్షాల నుండి ఒక్కొక్కరికి కేబినెట్ మంత్రులుగా మోదీ అవకాశం కల్పించారు. వీరు కింజరాపు రామ్మోహన్‌నాయుడు (తెదేపా), హెచ్‌డి కుమారస్వామి(జెడిఎస్) రాజీవ్‌రంజన్‌సింగ్(జెడీ యు), బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మారీa(హెచ్‌ఎఎం), చిరాగ్ పాశ్వాన్ (లోక్‌జనశక్తి పార్టీ).
స్వయంప్రతిపత్తిగలిన సహాయ మంత్రులగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురిలో కూటమి భాగస్వామి జయంత్ చౌదరి(రాష్ట్రీయ లోక్‌దళ్)కు అవకాశం లభించింది. మిగిలిన నలుగురు బీజేపీకి చెందిన వారు.
తెలుగు వెలుగులు
మోదీ సర్కార్ 3.0లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురికి చోటు లభించింది. వీరిలో ఇద్దరు కేబినెట్ మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి మూడోసారి వరుసగా లోక్‌సభకు శ్రీకాకుళం స్థానం నుంచి తెదేపా తరుపున ఎన్నికైన కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుండి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎన్నికైన బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు.
సహాయ మంత్రులుగా గుంటూరు లోక్‌సభ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్(తెదేపా), నర్సాపురం నుండి ఎన్నికైన శ్రీనివాసవర్మ(బీజేపీ), తెలంగాణలో కరీంనగర్ నుంచి రెండోసారి ఎన్నికయిన బండి సంజయ్(బీజేపీ) మోదీ మంత్రిమండలిలో చేరారు.
గతంలో అటల్ బిహరి వాజ్‌పేయి నాయకత్వంలో ఏర్పడిన మూడు ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వాలు, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన మొదటి రెండు సంకీర్ణ ప్రభుత్వాలతో సహా దాదాపు గత 20 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు మొదటిసారిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర ఇతర తెలుగు ప్రముఖులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
విస్తరణలో జనసేనకు అవకాశం?
ఆదివారం జరిగిన మోదీ మంత్రిమండలి ప్రమాణస్వీకారంలో జనసేనకు చెందిన లోక్‌సభ సభ్యులెవరూ ప్రమాణస్వీకారం చేయలేదు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులుగా మచీలిపట్నం లోక్‌సభ స్థానం నుండి బాలశౌరి, కాకినాడ నుండి ఉదయ్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈనెల 12న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుంది. ఇందులో జనసేనకు కనీసం నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో జనసేన తరుపు నుండి మంత్రులుగా చేరే నాయకుల పేర్లకు సంబంధించి స్పష్టత వచ్చిన తర్వాత జనసేన మోదీ ప్రభుత్వ విస్తరణ సమయంలో కేంద్ర ప్రభుత్వంలో చేరవచ్చని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి దేశ, విదేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ నుండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కూడా హాజరయ్యారు.
కొత్త కొలువులో కేబినెట్ మంత్రులు
1. నరేంద్ర మోదీ
2. రాజ్‌నాథ్‌సింగ్
3. అమిత్‌షా
4. నితిన్ గడ్కరీ
5. జేపీ నడ్డా
6. శివరాజ్ సింగ్ చౌహాన్
7. నిర్మలా సీతారామన్
8. ఎస్.జైశంకర్
9. మనోహర్‌లాల్ ఖట్టర్
10. హెచ్‌డీ కుమారస్వామి(జెడిఎస్)
11. పీయూష్ గోయల్
12. ధర్మేంద్ర ప్రదాన్
13. జితిన్ రామ్ మాంరీa(హెచ్‌ఎఎం)
14. రాజీవ్ రంజన్ సింగ్(జెడియు)
15. శర్వానంద్ సోనోవాల్
16. వీరేంద్రకుమార్
17. కె రామ్మోహన్ నాయుడు(టీడీపీ)
18. ప్రహ్లాద్ జోషి
19. జుయల్ ఓరమ్
20. గిరిరాజ్ సింగ్
21. అశ్వినీ వైష్టవ్
22. జ్యోతిరాదిత్య సింధియా
23. భూపేంద్ర యాదవ్
24. గజేంద్రసింగ్ షెకావత్
25. అన్నపూర్ణ దేవి
26. కిరణ్ రిజిజు
27. హర్‌దీప్‌సింగ్ పూరి
28. మన్సుక్ మాండవీయ
29. కిషన్‌రెడ్డి
30. చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జేఎస్‌పీ)
31. సీఆర్ పాటిల్
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన
సహాయ మంత్రులు
1. రావు ఇంద్రజిత్ సింగ్
2. జితేంద్రసింగ్
3. అర్జున్‌రామ్ మేఘవాల్
4. ప్రతాప్‌రావు గణపతిరావు జాదవ్
5. జయంత్ చౌదరి (ఆర్‌ఎల్‌డి)