- ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ఏర్పాటు చేద్దాం
- ప్రజల ప్రాణాలపట్ల అలక్ష్యం సరికాదు
- అధికారుల ఫీల్డ్ విజిట్లపై ప్రత్యేక పోర్టల్
- ప్రభుత్వం పని చేసేది పేదల కోసం… సంపన్నుల కోసం కాదు
- విద్యుత్ వినియోగదారులే విక్రేతలయ్యేలా ప్రణాళిక
- పథకాలపై ప్రచారంతో ప్రజల్లో అవగాహన పెంచాలి
- పంట కాల్వల పూడికతీత, చెరువుల లింకేజీకి 90 రోజుల యాక్షన్ ప్లాన్
- జల్ జీవన్ మిషన్ గడువు పెంపు శుభపరిణామం
- 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ఐటీ, క్వాంటం, ఏఐవంటి రంగాల్లో కొత్త టెక్నాలజీలు, ల్యాబులు ఏర్పాటు చేస్తున్న తరహాలోనే.. వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా అలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈక్రమంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేద్దామని సీఎం ప్రకటించారు. రెండురోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో ప్రచారం కల్పించాలని.. అలాగే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇదే సందర్భంగా ఇటీవల జరిగిన వివిధ ఘటనలపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వేట్లపాలెం బాణాసంచా పేలుళ్లు, శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనల్లో అధికార యంత్రాంగం అలక్ష్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బిలియనీర్ల కోసం పని చేయడం లేదని.. పేదల కోసం పనిచేస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ప్రతీ మూడు నెలలకూ పాలనా అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకెîళ్తున్నాం.
ఉన్న పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్సు చేస్తున్నాం. గతంలో కార్యాలయాల్లో కూర్చుని ఫైల్స్‌రాసే పరిస్థితినుంచి వర్చువల్ పని విధానాన్ని తీసుకువచ్చాం. గడచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వం తెచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. వీటి అమలులో ఉదాసీనత వద్దు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా తెచ్చిన 10 సూత్రాలు అమలు చేస్తే సుపరిపాలన అందించేందుకు వీలవుతుంది. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలి. ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పారదర్శకంగా అమలు చేయాలి. 13న అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల చేస్తున్నాం. కేంద్రం ఇచ్చే వాటితోపాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము జమ చేస్తుంది. రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా వేర్వేరు ప్రతినిధులు ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాన్ని సమర్ధంగా తీసుకెళ్దాం. ప్రజల్లోకి వెళ్లి… ఈ పథకం గురించి చెప్పాలి. డబ్బులు విడుదల చేస్తున్నామని వివరించాలి. ఖరీఫ్ సాగుకోసం మే 15న నీటిని విడుదల చేస్తున్నాం. సీజన్‌లో ముందుగానే నీరిస్తాం. మే 15నుంచే సాగుకు సిద్దమవుదాం. ఏఐ అగ్రానమిస్ట్ సేవలు కూడా అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ వ్యవసాయదారుడికి ఏఐ అగ్రానమిస్ట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
భూ వివాదాలు లేకుంటే 70 శాతం సమస్యలు తీరినట్టే…
“ఉగాది కానుకగా 2.5 లక్షల లబ్దిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తాం. జూన్ నెలలో మరికొన్ని ఇళ్లను లబ్దిదారులకు ఇస్తాం. ఇల్లు, ఇంటి జాగా కూడా మూడేళ్లలో ఇవ్వాల్సి ఉంది. ఇంద్రధనస్సు పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతోపాటు మరికొన్ని కార్యక్రమాలు అమలు చేయబోతున్నాం. గత పాలనలో ట్రూ ఆప్ పేరిట విద్యుత్ చార్జీల భారం వేశారు. తొలిసారి ట్రూ డౌన్ చేశాం. రూ.4,600 కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఏడాది 39 పైసలమేర విద్యుత్ కొనుగోలు ధర తగ్గిస్తాం. కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్లు ఇస్తున్నాం. సబ్ స్టేషన్ యూనిట్‌గా మైక్రో గ్రిడ్ ఏర్పాటుతోపాటు ప్రోజ్యూమర్ కాన్సెప్టును సమర్ధంగా అమలు చేయాలి. విద్యుత్ ఉత్పాదన ఓ సంపాదనా మార్గంగా మారాలి.
విద్యుత్ వినియోగదారులను విక్రేతలుగా మార్చేలా రూపొందించిన ప్రణాళికను సక్సెస్ చేయాలి. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ కింద 1.12 లక్షలమంది మహిళా మైక్రో ఎంట్రప్రెన్యూర్లను తయారు చేశాం. వచ్చే ఏడాదికి 5 లక్షలమంది మహిళలను పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. 2047 నాటికి ప్రతీ వెయ్యి మందికి ఒక స్టార్టప్ ఏర్పాటు చేసుకునేలా లక్ష్యంగా పెట్టుకుందాం. సమర్ధ నీటి నిర్వహణ చాలా కీలకమైన అంశం. నీటి భద్రత కోసం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. గడచిన రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.82 మీటర్లమేర భూగర్భజలాలు పెరిగాయి. మార్చి 1నాటికి 8.10 మీటర్లలో భూగర్భ జలాలున్నాయి. ఏప్రిల్ 1నుంచి జూన్ నెలాఖరు వరకూ 90 రోజులపాటు నీటి సంరక్షణా చర్యలు చేపట్టాలి.
నో సబ్ మెర్జెన్స్ విధానంలో కాలువల పూడికలు, చెరువుల లింకేజీలాంటి కార్యాచరణ చేపట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 614 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లలో ఉన్నాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో సాగు సీజన్‌ను ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళిక చేస్తున్నాం. భూగర్భ జలాలు పెరిగితే ప్రభుత్వం ఇస్తున్న రూ.14 వేల కోట్ల విద్యుత్ సబ్సీడీలు భారం తగ్గుతుంది. వెలిగొండను జూలైనాటికి పూర్తిచేసి నీటిని ఇస్తాం. 30 ఏళ్ల క్రితం నేనే శంకుస్థాపన చేశాను. పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. 2027 మార్చినాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. ఎక్కడా భూ వివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయాలి. పిటిషన్ కల్చర్‌ను తగ్గించేలా చర్యలు చేపట్టాలి. వాస్తవాలన్నీ పోర్టల్‌లో పెడితే వివాదాలు తగ్గుతాయి. పీజీఆరఎస్ ద్వారా ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం కావాలి. అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. భూవివాదాలు లేకపోతే 70 శాతం సమస్యలు తగ్గుతాయి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రజల ప్రాణాలపట్ల ఉదాసీనత ఉంటే సహించం
“శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం కల్తీ పాలు, వేట్లపాలెం బాణసంచాలాంటి ఘటనలు బాధాకరం. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవరు వ్యవహరించినా కఠినంగా ఉంటాం. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయి…? బాణాసంచా నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తుంటే ఏం చేస్తున్నారు..? కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. సీనియర్ సెక్రటరీలు 4 రోజులపాటు క్షేత్రస్థాయికి వెళ్లాలి. దీనిపై పోర్టల్ తయారుచేసి ఆన్ లైన్‌లో పెట్టేలా సీఎస్ బాధ్యత తీసుకోవాలి. క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది కలెక్టర్లే. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. ఏది వాస్తవమో అధ్యయనం చేసుకుని తగిన నిర్ణయం తీసుకునే బాధ్యత కలెక్టర్లదే. ప్రభుత్వం పని చేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి.
సంజీవని ప్రాజెక్టును సమర్ధంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. 72 లక్షలమందికి వివిధ ఆరోగ్య సమస్యలున్నట్టు స్క్రీనింగ్‌లో తేలింది. ప్రతీ ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందించాలి. గత పాలకులు చేసిన తప్పువల్ల జేజేఎం కింద నిధులు కోల్పోయాం. శాశ్వత పరిష్కారంగా ప్రాజెక్టులు పూర్తిచేసి ఉండాల్సింది. జేజేఎం కింద కేవలం రూ.2వేల కోట్ల నిధులను మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్రాన్ని కోరాం. పాత స్కీంను రూ.28 వేల కోట్లను ఖర్చు చేసేలా 2028 వరకూ పొడిగించారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతీ ఇంటికీ సురక్షితమైన తాగునీరు ఇచ్చేలా కనెక్టు చేయాలి. స్థానిక నీటి వనరుల నుంచి నీటిని అందించేలా చూడాలి. 2 ఏళ్లలో జేజేఎం పథకాన్ని పూర్తి చేసుకుని ప్రతీ ఇంటికీ కుళాయి ఇవ్వండి. పైప్‌లైను వేయడం కోసం రోడ్లను తవ్వేసి మళ్లీ సరిచేయకుండా వదిలేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. మేజిక్ డ్రెయిన్లను కూడా వేగంగా చేయండి. పైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు కూడా అమల్లోకి వస్తున్నాయి. ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ మార్చి 15కు ప్రారంభమవుతుంది. కనీసం 50 మున్సిపాలిటీలకు అవార్డులు రావాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు.. పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి. అమరావతి ప్రాంతంలో ఇరువైపులా చెట్లు, పూలతో రోడ్లు అత్యంత రమణీయంగా ఉన్నాయి. ఇతర ప్రాంతాలు కూడా అందంగా మార్చేలా చర్యలు తీసుకోవాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.
23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
“పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ, డేటా డ్రివెన్ గవర్నెన్సు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా గణనీయంగా పెరగాలి. డిజిటల్ లిటరసీని పెంచేలా ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకుందాం. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్సును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోండి. సెప్టెంబరులో ప్రాజెక్టులు పూర్తి చేసి యాక్షన్ టేకెన్ రిపోర్టు అందరి ముందు పెడతామని చెప్పాం. దానికి అనుగుణంగా కలెక్టర్లు పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అయ్యే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. మార్చి 23న అర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును శంకుస్థాపన చేయబోతున్నాం. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. 2028 మార్చిలోగా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించాం. కొప్పర్తి, ఓర్వకల్లులాంటి ప్రాంతాలు పారిశ్రామిక క్లస్టర్లుగా తయారు కావాలి. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎసఎంఈలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్ధంగా వెళ్లాలి. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై చర్చ జరగాలి. పీ`4 కూడా ఓ గేమ్‌చేంజర్. ఇది టేకాఫ్ కావడానికి కొంత సమయం పడుతుంది కానీ మంచి ప్రయోజనాలు వస్తాయి. కలెక్టర్లు పీ`4ను మానిటర్ చేయాలి. 2047కి రూ.55 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా చూడాలి. మహిళ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు స్వయం బ్రాండ్‌తో మార్కెటింగ్ చేసేలా దృష్టి పెట్టాలి.
ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు మనపై కూడా పరోక్షంగా పడుతోంది. ప్రవాసాంధ్రులు వేర్వేరు దేశాల్లో విస్తరించి ఉన్నారు. గుడ్లు, అరటిలాంటి ఉత్పత్తుల ధరలు ఈ కారణంగా పడిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లకు మన ఉత్పత్తులు చేరుకోవాలి. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగంలో కేపీఐలు మెరుగుపడాలి. రూ.20 లక్షల కోట్లకు స్థూల ఉత్పత్తి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 15.1 శాతం మేర వృద్ధిరేటు లక్ష్యాన్ని కూడా సాధించేలా చర్యలు చేపడుతున్నాం. మన యువతకు నైపుణ్యాభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ఏఐ, క్వాంటంలాంటి సాంకేతికతలోనూ మన యువతకు నైపుణ్యాలు పెరగాలి. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇంఛార్జి మంత్రులు, కార్యదర్శులు ఈ లక్ష్యాలపై దృష్టి సారించాలి” అని సీఎం చంద్రబాబు దిశనిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రులు, సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













