- కరోనా సమయంలో ఇళ్లవద్దకే మందులు పంపించాం
- తాగునీటి సమస్య పరిష్కారానికి సొంతనిధులతో జలధార
- మహిళల స్వయం ఉపాథికి శిక్షణ.. 300మందికి తోపుడుబళ్లు
- పేదల ఆకలి తీర్చేందుకు అన్నక్యాంటీన్లు ఏర్పాటుచేశాం
- అధికారంలో లేకపోయినా 12 సంక్షేమ పథకాలతో సేవలు
- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
మంగళగిరి : తాడేపల్లి పట్టణంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని టిడిపి యువనేత నారా లోకేష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. తాము ఎన్నికల్లో ఓడిపోయినా మంగళ గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సొంత నిధులతో పలు అభివృద్ధి, సంక్షేమ, వైద్య సహాయ కార్యక్రమాలను అమలుచేసినట్లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. గత 40నెలలుగా నియోజ కవర్గానికి తామేం చేశారో వివరించారు. కోవిద్ సమయంలో నియోజకవర్గంలో చాలా మందికి అమెరికా నుంచి జూమ్ కాన్ఫరెన్స్‌లో డాక్టర్ల ద్వారా 1000 మందికి పైగా టీడీపీ చికిత్స అందించింది. కొవిద్ బాధితులకు టెలిమెడిసిన్, ఆక్సిజన్ అందించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా అన్నక్యాంటీన్లు ఆపేశారు. పేద ప్రజ లను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి, తాడేపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. ప్రభుత్వ చేతగానితనంలో రోడ్ల అభివృద్ధికి నోచుకోని పలు గ్రామాలు, వార్డుల్లో పార్టీ తరపున గ్రావెల్ రోడ్లు వేశాం. వికలాంగులకు పార్టీ తరపున ట్రై సైకిల్స్, స్కూటర్లు అందజేశాం. నియోజకవర్గంలో నిరుపేదల కు స్వయం ఉపాధి కల్పించేందుకు 300లకు పైగా తోపుడు బండ్లను ఉచితంగా అందించాం. నియోజక వర్గంలో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని జలధార పథకం ద్వారా ఉచిత మంచినీరు సరఫరా చేశాం. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా నిరుపేద మహిళ లకు ఉచితంగ ట్రైనింగ్ ఇచ్చి టైలరింగ్ మిషన్లు, బ్యూటిషియన్ కిట్లు అందజేశాం. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ,యువకులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యో గాలు కల్పించాం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్టీ ఆర్ సంజీవని కార్యక్రమం ద్వారా 10వేల మందికి పైగా పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందిస్తు న్నాం.
దుగ్గిరాలలో ఆరోగ్య రథం, మంగళగిరి, తాగే పల్లిలో ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించాం. మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఎన్టీఆర్ సంజీవని పథకం ద్వారా ఉచితంగా మందులు అందించాం. డయాబెటిస్ పెషెంట్లకు పదిహేను రోజు లకు ఒకసారి ఉచితంగా ఇంటి దగ్గరకే మందులు పంపిణీ చేశాం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 12 సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజల కోసం చేశాం. ప్రతిపక్షంలో ఉన్నా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నియోజకవర్గ ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే సంక్షేమ పథకాలు అమలు చేశాం. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన కొండవీటి వాగును నిర్మించారు. కనీసం కొండవీటి వాగు మెయింటెనెన్స్ చేసే పరిస్థితిలో కూడా ప్రస్తుత ప్రభుత్వం లేదని లోకేష్ పేర్కొన్నారు.
కనీసం మంచినీళ్లయినా ఇచ్చారా ఆర్కే?
మంగళగిరిలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే కనీసం తాగునీరు కూడా సరఫరా చేయలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అటవీ భూములు ఉన్నవారికి ఇస్తామన్న ఇళ్ల పట్టాల పంపిణీ హామీ ఏమైంది? ఎన్నికల ముందు లోకేశ్ గెలిస్తే పేద వాళ్ల ఇళ్లు కొట్టేస్తారని అబద్ధలు ప్రచారం చేసి.. మీరు ఎందుకు పేదల ఇళ్లను తొలగించారు? మంగళగిరిలో లోకేశ్ కి భయపడి జగన్‌రెడ్డి మొదటి రెండు బడ్జెట్లలో రూ.2500 కోట్లు నియోజకవర్గానికి కేటాయించారు. మీ చేతగాని తనంతో ఆ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించలేదు. తాను శానసభ్యుడిగా గెలిచి ఉంటే ఇప్పటికే రూ.3000కోట్ల అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టేవాళ్లం. సీఎం హెలిప్యాడ్కు వెళ్లే బ్రిడ్జిని కూడా కట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను రంగులు మార్చి ఇచ్చారు. నియోజకవర్గంలో ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న పదివేల మంది పేదలకు ఎందుకు ఇప్ప టికీ ఇళ్లు కట్టించలేదు? ఈ ప్రభుత్వంలో తాడేపల్లి గంజాయికి అడ్డగా మారింది. కృష్ణా నది ఒడ్డున ఒక మహిళపై అత్యాచారం జరిగితే.. ఇప్పటికీ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్కే న్యాయం చేయలేదు. నియోజకవర్గంలో తోపుడుబండ్లపై గంజాయి మూకలు దాడులు చేస్తున్నా ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదు? రైల్వే పట్టాల పక్కన ఉన్న భూములకు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు.ఎన్నికల్లో గెలిచేందుకు ఆర్కే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సవాల్ చేస్తున్నా. నియోజకవర్గంలో 300 మందికి సంబంధించిన 178 ఎకరాల భూమిని యు1 నుంచి మినహాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మాటతప్పారు. మీరు రియల్ ఎస్టేట్ చేసేందుకే యు1 ను తొలగించడం లేదు. మీరు రియల్ ఎస్టేట్ చేసేందుకు పన్ను గజాల వారీగా కడితే యు1 నుంచి తొలగిస్తామని మాయ మాటలు చెప్పి ఎమ్మెల్యే ఆర్కే తప్పించుకుంటున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే ఆర్కే ప్రజలకు సమాధానం చెప్పాలి.
దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి
ఇప్పటివరకు నియోజకవర్గ ప్రజలకు ఏం చేశా రో శ్వేత పత్రం విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో మంగళగిరి నియోజక వర్గానికి కేటాయించిన నిధులు, 2019-22 వరకు మీరు ఎన్ని నిధులు విడుదల చేసి అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఛాలెంజ్ చేస్తున్నా. తాగునీటి సమస్య పరిష్కారానికి టెండర్లు పిలిస్తే అడ్డుపడిన ఎమ్మెల్యే ఆర్కే నీతులు చెప్పడం దారుణం. వాటర్ పైప్లిన్లకు మీటర్లు బిగించేందుకే నియోజకర్గం లో రోడ్లు తవ్వారు. మంగళగిరి డంప్ యార్డు మారు స్తా అని హామీ ఇచ్చి ఎందుకు మార్చలేదు. ఎమ్మెల్యే వస్తే మంగళగిరి, తాడేపల్లిలో రోడ్లపై చెత్త, పందులు తిరగడాన్ని చూపిస్తాం
దోపిడీలోనూ ఆయనే నెం.1
సొంత కుటుంబ సభ్యులకే ఇసుక దోచుకునేం దుకు టెండర్లు ఇచ్చారు. ప్రతిపక్ష నేత ఇంటిపక్కనే నాలుగంతస్తులు, ఎన్‌ఆటర్‌ఐల ఆసుపత్రి పక్కన ఐదు అంతస్తుల మేర అక్రమ ఇసుకను డంప్ చేశారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఒక లారీ ఇసుక కూడా దొరకని పరిస్థితి నెలకొంది. టీడీపీ అధికారం లోకి వచ్చిన వెంటనే వైసీపీ అక్రమాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా విచారించి అక్రమ సొమ్ము వసూలు చేస్తాం. అన్ని మండలాల్లో సమస్యలను బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా టీడీపీ నేతలు తెలుసుకుంటున్నారు. సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు పెద్దమనసుతో వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.