- కేంద్రం నుంచి రావాల్సినవాటిపై దృష్టిపెట్టాలి
- పెండిరగ్ ప్రాజెక్టులకు ఆమోదం కీలకం
- నిధుల సాధనలో ఎంపీలదే ప్రధానపాత్ర
- అఖండ విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
- టీడీపీపీ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా పోటీ పడి పనిచేయాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. పార్లమెంట్‌లో ఎలా వ్యవహరించాలి.. రాష్ట్రానికి ఏం కోరాలి.. రాష్ట్రం కోసం ఏం మాట్లాడాలి.. వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీలకు వివిధ అంశాలపై చంద్రబాబు పలు సూచనలు చేశారు.
ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తిరుగులేని మెజారిటీలతో గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాలి. ఇప్పటికే 5 హామీలపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. ఎంపీలకు ప్రత్యేకంగా శాఖలు అప్పగించాం. ప్రతి మూడు నెలలకు ఒక సారి పనితీరుపై సమీక్షిస్తా. ఎన్ని నిధులు తెచ్చారు…కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో మీ పనితీరును సమీక్షిస్తాం. అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు జరిగేలా చూడాలి. విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 లో ఉన్న ఆస్తుల పంపకాన్ని పూర్తి చేయాలి. ఇప్పటికే దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టాం. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు అన్నీ 2014 నుంచి 2019 వరకు వేగంగా పూర్తి అయ్యాయి. కానీ జగన్ అన్నింటినీ రివర్స్ చేశాడు. నాడు మంజూరు చేసిన పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేయాలి.
అవసరం అయిన నిధులు తెచ్చి కార్యకలాపాలు ప్రారంభించాలి. కడప ఉక్కు పైనా కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉంది. విశాఖ స్టీల్ విషయంలో తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టాలి. ప్లాంట్ ను సమర్థవంతంగా నడిపేందుకు చర్యలు తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మైన్స్‌ను కేటాయించే అంశాన్ని పరిశీలించాలి. రాజధాని అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు తేవాలి. ప్రకాశం జిల్లాకు కూడా వెనుకబడిన జిల్లా కింద నిధులు తేవాలి. వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీని కేంద్రం నుంచి సాధించాలి. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక రాయితీలు కూడా సాధించాలి. విశాఖలో రైల్వే జోన్ కు అవసరం అయిన భూములు కేటాయించే ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. నడికుడి` కాళహస్తి రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలి.
భూసేకరణ సమస్యను పరిష్కరించాలి. కోటిపల్లి- నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు భూ సేకరణ జరగలేదు. దీన్ని కేంద్రంతో మాట్లాడి ముందుకు తీసుకువెళ్లాలి. నేషనల్ హైవేస్ పైనా ఎంపీలు ఫోకస్ పెట్టాలి. అమరావతి ` అనంతపురం హైవే, రాజధాని ఔటర్ రింగ్ రోడ్డ్ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. ట్రైబల్ యూనివర్సిటీ కొత్త వలసలోనే ఏర్పాటవుతుంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి. ప్రతి నిముషం, ప్రతి రోజూ ముఖ్యమే అనే విధంగా ఎంపీలు పనిచేయాలి. ఆ స్థాయిలో ఎంపీలు ఎంత ఎక్కువ చొరవ చూపితే రాష్ట్రానికి అంత త్వరగా మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.