అమరావతి: ప్రతి ఏటా పద్ధతి ప్రకారం జరిగే ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ ఏపీ సర్కారు రద్దు చేయడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, తక్షణమే కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరు తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. అయ్యా! ముఖ్యమంత్రిగారూ మీ రివర్స్ పాలనలో ఇప్పటికే అన్నిరంగాలు తిరోగమనంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు ఎం సెట్ కౌన్సెలింగ్ కూడా మీకు అలవాటైన రివర్స్‌లో చేస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం చేశారు. పద్ధతిగా జరగాల్సిన 3వ విడత కౌన్సెలింగ్ రద్దుచేసి విద్యార్థులకి తీరని ద్రోహం చేశారు. మీకు ఇద్దరు పిల్లలున్నారు. రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ మేనమామ నంటావు. కనీసం తండ్రి మనసుతో ఆలో చించినా మంచి బ్రాంచిలో ఇంజనీరింగ్ చేయాలనే కలలు కల్లలైన పిల్లలు చేతులు కోసుకుంటూ, రక్తాలతో రాస్తున్న లేఖలు చూసైనా మనసు కరగదా? 3వ విడత కౌన్సెలింగ్‌లో తమకి దగ్గరలోని కాలేజీలో కోరుకున్న బ్రాంచి వస్తుందని నిరీక్షిస్తున్న వేలమంది విద్యార్థులు, నీ రివర్స్ దెబ్బకి తల్లిదండ్రులకి మొఖం చూపించలేక ఆత్మహత్యాయత్నాలకి పాల్పడుతున్నారు. తొలి విడతల్లో దూరప్రాంత కాలేజీలో సీట్లు వచ్చిన విద్యార్థులు 3వ విడత కౌన్సెలింగ్ కోసం నిరీక్షిస్తుంటే..స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించడం తీరని అన్యాయం చేయడమే. మంత్రి బొత్స సత్యనారాయణ కౌన్సెలింగ్ డేట్ ఇస్తామని విద్యార్థులకి హామీ ఇచ్చి మరీ మోసగించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతీ ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతలకే పరిమితం చేయడం వెనుక ఆంతర్యం ఏంటో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్పాట్ అడ్మిషన్లు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక్కర్లేదని, కౌన్సెలింగ్ సీట్లయితే చెల్లించాల్సి వస్తుందనే కుతంత్రంతోనే ఏకంగా 3వ విడత కౌన్సెలింగ్ రద్దు చేయడం అన్యాయం. స్పాట్ అడ్మిషన్లు, కన్వీనర్ కోటాలో సీఎస్ఈ సీట్లన్నీ అమ్ముకునేందుకు సర్కారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. 3వ విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న 13 వేలమంది విద్యార్థులు ప్రభుత్వానికి, విద్యామంత్రికి, ఉన్నత విద్యామండలి అధికారులకి చేసుకున్న వినతులు కనీసం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడంలేదో అర్థం కావడంలేదు. అక్రమ కేసులో మమ్మల్ని అరెస్టు చేసేందుకు పెట్టిన శ్రద్ధలో ఒకటో వంతు రాష్ట్ర సమస్యలపై పెట్టి ఉంటే వ్యవస్థలు ఇంత అస్తవ్యస్తంగా తయారయ్యేవి కావు. విద్యార్థుల ఆత్మహత్యాయత్నాలు ఆగేవి. విద్యార్థులు భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల ఆందోళనని దృష్టిలో పెట్టుకుని తక్షణమే 3వ విడత కౌన్సెలింగ్ చేపట్టాలని లేఖలో లోకేష్ డిమాండ్ చేశారు.