యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం కర్నూలు 48వవార్డు రోజాదర్గా వద్ద ముస్లిం మతపెద్దలను కలిసి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. రోజా దర్గాలోకి వెళ్లి మతపెద్దలకు అభివాదం చేసిన లోకేష్ ను వారు ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. యువగళం పాదయాత్ర విజయవంతమయ్యేలా తనను ఆశీర్వదించాలని మతపెద్దలను లోకేష్ విన్నవించారు.
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సిఎం కావాలని అల్లాను ప్రార్థించాల్సిందిగా యువనేత మతపెద్దలను కోరారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు యువనేతకు షాయా కప్పి ఫాతియా అందజేశారు. మసీదు నిర్వహణ, ముస్లిం సోదరులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై లోకేష్ వారిని అడిగి తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక మసీదులు, దర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. చాలాచోట్ల ఖబరిస్తాన్ లు ఆక్రమణలకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, రక్షణగోడలు ఏర్పాటుచేసి వాటిని పరిరక్షిస్తామని లోకేష్ తెలిపారు.