న్యూఢిల్లీ: రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయని టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..ప్రధానమంత్రిగా మోదీ ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు. కేంద్రం ముందు టీడీపీ ఎలాంటి డిమాండ్లు ఉంచుతుందన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. దానికిప్పుడు సమయం కాదని పేర్కొన్నారు. తాము ఎన్డీయే భాగస్వాములమని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి తీసుకోవాల్సినవి చాలానే ఉన్నాయని, అదంతా పద్ధతి ప్రకారం జరుగుతుందని తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, దానిని పునర్నిర్మించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని, ఈ విషయంలో ఎలాంటి సమస్యా లేదని తేల్చి చెప్పారు.