- మూడు నెలల్లో 1338 అర్జీలు పరిష్కరించాం
- వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరికీ నష్టపరిహారం
- వైసీపీ బురద రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
- పడవలతో గుద్ది ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్ర
- అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు
- ప్రజాదర్బార్‌లో మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక
మచిలీపట్నం(చైతన్యరథం): ప్రజలకు అండగా నిలిచే విషయంలో వెనుకడుగు వేసేది లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడుసార్లు ప్రజాదర్బార్ నిర్వహించామని, గత రెండు వారాలుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, విజయవాడలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా నిర్వహించుకోలేకపోయామని చెప్పారు. మచిలీపట్నంలో సోమవారం ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రజాదర్బార్‌లో 1338 అర్జీలు వచ్చాయని తెలిపారు. పది రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం నీట మునిగింది. ఎన్నడూ లేని విధంగా 11.48 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో జిల్లా మొత్తం ముంపునకు గురైంది. 11.70 లక్షల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ప్రకాశం బ్యారేజీకి 11.48 లక్షల వరద రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇంతటి వరద కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రజలు భయపడ కుండా సహాయక చర్యలకు ముందుకొచ్చారు. ప్రజలు, అధికారులు పకడ్బందీగా పనులు చేయడంతోనే ప్రాణాపాయం లేకుండా చేసుకున్నాం. ప్రకాశం బ్యారేజీ దిగువన కట్టలపై తెల్లవార్లూ కాపలా కాసి మరీ ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఎక్కడైనా గండిపడే అవకాశం ఉందనిపిస్తే ముందుగానే ఇసుక బస్తాలు వేసి నీరు జనావాసాల్లోకి చేరకుండా అడ్డుకుని ప్రాణాలు పోకుండా చూసుకున్నారు. అలాంటి వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.
గత ప్రభుత్వ నిర్వాకంతోనే విజయవాడకు ఈ దుస్థితి
గత ప్రభుత్వ మయాంలో పోలవరం కుడి కాలువ మట్టితో ఇతర కాలువల కట్టలు బలోపేతం చేసే అవకాశం ఉన్నా అలా చేయలేదు. పైగా మట్టిని అమ్ముకుని జేబులు నింపుకున్నారు. ఫలితంగా ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోనే 42 వేల హెక్టార్లకు పైగా పంటలు నీట మునిగాయి. లంక గ్రామాల్లో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. వారందరికీ నిత్యావసర సరుకులిచ్చాం. ఆహారం సకాలంలో అందించి ఆకలితో బాధపడకుండా చూసుకున్నాం. అదే సమయంలో నష్టం అంచనాలను కూడా సిద్ధం చేశాం. త్వరలోనే పరిహారం అందజేతకు కూడా సన్నాహాలు చేస్తున్నాం. ప్రతిఒక్కరికీ నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల సర్వీస్ సెంటర్లతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర బృందం రెండు సార్లు వరద ప్రబావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పంటలన్నింటినీ దగ్గరుండి పరిశీలించారు. ప్రతి రైతునీ కేంద్రం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అదే సమయంలో బుడమేరును పునరు ద్ధరించేందుకు కేంద్రం నుండి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రేయింబవళ్లు శ్రమించి పనిచేస్తుంటే ఒక్కరోజు వచ్చి జగన్ రెడ్డి నానా యాగీ చేస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు.
బెజవాడను శ్మశానం చేసేందుకు కుట్రలు చేశారు
విజయవాడకు మణిహారం లాంటి ప్రకాశం బ్యారేజీని సైతం కూల్చేందుకు ప్రయత్నిం చడం సిగ్గుచేటు. దాదాపు 40-50 టన్నుల బరువుండే పడవలను ఒకదానితో ఒకటి కట్టి కూల్చాలనుకోవడాన్ని మించిన మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? జగన్‌రెడ్డి నిర్వాకం కారణంగా బుడమేరుకు గండ్లు పడ్డాయి. 32 డివిజన్లు నీట మునిగాయి. లక్షలాది మంది అవస్తలు పడుతున్నారు. గన్నవరం, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాలు సహా కొల్లేరు వరకు అనేక ప్రాంతాల్లో లక్షలాది మందిని అవస్థలకు గురి చేశాడు. సహాయక కార్యక్రమాలపై కూడా జగన్ రెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏ ఒక్కరికీ ఆహారం అందలేదు అనే మాట రాకుండా పనిచేస్తుంటే.. తూతూ మంత్రంగా వచ్చి హడా వుడి చేస్తున్నాడు. బాధితుల వద్ద గంట కూడా నిలబడని వ్యక్తి జైల్లో ఉన్న నేరస్తులను పరామర్శించడానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడని ధ్వజమెత్తారు. విజయవాడ వరద సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం తపించి పోరాట పటిమతో సహాయ సహకారాలు అందించిన ప్రతిఒక్కరికీ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి రామకృష్ణ, బీజేపీ ఇన్‌చార్జి సోమిశెట్టి బాలాజీ పాల్గొన్నారు.